Followers

తెలుగువాడు కావడమే పింగళి శాపమా ?

తెలుగువాడు కావడమే పింగళి శాపమా ?

రాజమండ్రి, పెన్ పవర్ 

భారత జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య తెలుగువాడు కావడమే శాపం అయిందేమో? అని ఆయన మనుమడు శ్రీ ఘంటసాల గోపీకృష్ణ ఆవేదన చెందారు. ప్రతి ఒకరూ  జండాకి శాల్యూట్ చేస్తున్నారే కానీ, ఆ జండా రూపకర్తకు భారత ప్రభుత్వ గుర్తింపు కోసం ఎందరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయన నిలదీశారు. మంగళవారం గోపీకృష్ణ, సిపి బ్రౌను మందిరం సందర్శించి బ్రౌను చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మందిరం నిర్వాహకులు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో గోపీకృష్ణ మాట్లాడారు. ఎపిఐఐసి పూర్వ చైర్మన్ శ్రీ శిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం అతిధిగా పాల్గొన్నారు. పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పన చేశారని, ఆ జండాలో  చరఖాను తీసి స్వల్ప మార్పు చేసిన సురహజ్ ప్రస్తావన తీసుకు రావడంలో ఔచిత్యం లేదని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ను కనిపెట్టినది గ్రహంబెల్ అని అందరికీ తెలుసని, ఆ తరువాత ఫోన్ లలో ఎన్ని మార్పులు చేసినా, గ్రహంబెల్ పేరునే స్మరిస్తున్నామా లేదా ? అని గోపాలకృష్ణ ప్రశ్నించారు.గతంలో సచిన్ టెండూల్కర్ కి భారత రత్న ఇచ్చిన సందర్భంలోనూ ఇదే అంశం చర్చకు రావడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, సచిన్ కి భారత రత్న ఇవ్వడానికి మాత్రం తాను వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు.పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రధాన మంత్రికి లేఖ వ్రాయడాన్ని ఈ సందర్భంలో గోపాలకృష్ణ ప్రస్తావించారు. ప్రతి ఒక్క భారతీయుడు ప్రధానికి మెయిల్ ద్వారా విన్నపం చేయాలని, పది కోట్ల మంది ఉన్న రెండు రాష్ట్రాల తెలుగు వారిలో కనీసం కోటి మంది మెయిల్  పంపితే చాలని ఆయన కోరారు.భారతీయుల బాధ్యత శివరామ సుబ్రహ్మణ్యం హామీ పింగళి వెంకయ్యకు  భారత రత్న ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రజలను కోరే పరిస్ధితి రావడం శోచనీయమని ఎపిఐఐసి పూర్వ చైర్మన్ శ్రీ శిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆవేదన చెందారు. భారత జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్యకు భారత రత్న వచ్చేలా పోరాడాల్సిన బాధ్యత ప్రజలమీదే ఉందని ఆయన వెల్లడించారు. అవసాన దశలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పింగళి వెంకయ్య కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదుకోవడం ఆయన దేశభక్తికి నిదర్శనంగా శివరామ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. భారతీయుడైన‌ ప్రతి వ్యక్తి పింగళి వెంకయ్యకు భారత రత్న రావాలని కోరుకోవాల్సిందే అని ఆయన అన్నారు. తన వంతుగా అనేక మంది చేత ప్రధాని మోదీకి మెయిల్స్ పంపించే ఏర్పాటు చేస్తానని శివరామ సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు.ప్రముఖ గాయకుడు జిత్ మోహన్ మిత్ర మాట్లాడుతూ, పింగళి వారసుడు రావడంతో రాజమండ్రి పునీతం అయిందని అన్నారు. బ్రౌను మందిరం పక్షాన శివరామ సుబ్రహ్మణ్యం, సన్నిధానం శాస్త్రి, గోపీ కృష్ణ కు సన్మానం‌చే శారు. బ్రౌను మందిరం జ్ఞాపికను ప్రజా నాయకుడు ప్రసాదుల హరనాధ్ గోపీకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో దూర్వాసుల సత్యనారాయణ, నందం స్వామి,‌ రెడ్డిపార్వతి, సౌమ్య, జి.పార్వతి, నిమిషకవి, సుబాష్, పొక్కులూరి రామ్మూర్తి, భ్రమరాంబ, జిలాని, ఆదినారాయణ, తణుకు గోపాలకృష్ణ, బాబా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...