అశేష భక్త జనానికి బాబా ఆశీస్సులు
ఘనంగా 62వ ఉరుసు మహోత్సవ ఊరేగింపు..అలరించిన కళా బృందాలు..
ఖాదర్ బాబా స్మరణతో మారుమ్రోగిన నగరం..
విజయనగరం, పెన్ పవర్
ప్రేమా మయుడు, సాక్షాత్ భగవత్ స్వరూపుడు, సూఫీ మహనీయుడు హజరత్ ఖాదర్ వలి బాబా అశేష భక్త జనంపై తన ఆశీస్సులు కురిపించారు. బాబా నామ స్మరణతో విజయనగర పురవీధులు మారుమ్రోగాయి. పుర వీధుల్లో ప్రత్యేక వాహనంపై ఊరేగిన ఖాదర్ చిత్ర పటం ముందు భక్తులు బారులు తీరారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరం బాబామెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో సూఫీ మహనీయులు హజరత్ ఖాదర్ వలి బాబా వారి 62 వ మహా సూఫీ సుగంధ మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం బాబా చిత్ర పట ఊరేగింపు ఘనం జరిగింది. దర్గా, దర్బార్ షరీఫ్ షా ముతావల్లి(ధర్మ కర్త), ఖాదర్ బాబా వారి ప్రియ శిష్యులు, సూఫీ మహాత్మ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఊరేగింపును ప్రారంభించారు.
దర్భార్ నుంచి ప్రత్యేక హంస రధంపై ఆశీనులైన ఖాదర్ బాబా వారికి వేలాది మంది భక్తులు జేజేలు పలికారు. ధర్మకర్త, బాబా ప్రియ శిష్యులు అతావుల్లా బాబా కుమారులైన జాఫర్ సాధిక్, ఎండీ ఖ్వాజా మోహిద్దీన్, డాక్టర్ ఎండీ ఖలీలుల్లా షరీఫ్, తాజ్ ఖాదర్ తదితరులు ఖాదర్ బాబా కి ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించి ఊరేగింపులో పాల్గొన్నారు.బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖాదర్ బాబా దర్గా షరీఫ్ వద్ద ఖురాన్ పఠనం జరిగింది. సర్వ మానవాళి క్షేమం కోసం, దేశం సుభిక్షంగా ఉండాలని సూఫీ ప్రచారకులచే ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి. అనంతరం దర్భార్ షరీఫ్ నుంచి నషాన్, చాదర్, సందల్ షరీఫ్ లతో పాటు ఫకీరు మేళా ఖవ్వాలితో నగర పుర వీధుల్లోకి ఖాదర్ బాబా వారు ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు.
తప్పెట గుళ్ళు, పులి వేషాలు, తీన్ మార్ వంటి కళా బృందాలు తమ ప్రదర్శనలతో బాబాను స్తుతించారు. భక్తులు కరెన్సీ నోట్ల దండలు, పూల దండలు సమర్పిస్తూ తమ భక్తి భావాలను చాటుకున్నారు. ఖాదర్ బాబా దర్గా, దర్భార్ లో సర్వమత సమ్మేళనం తొణికిసలాడింది. మానవత్వం మేళవించింది. సమానత్వంతో సంబరం(ఉరుసు) విజయవంతమైంది. దేశ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు డాక్టర్ ఎండీ ఖలీలుల్లా షరీఫ్ ఏర్పాట్లు ఘనంగా చేశారు. అతి పెద్ద లంగర్ ఖానాలో నిర్విరామంగా అన్న సమారాధన నిర్వహించి భక్తులకు ఖాదర్ బాబా ప్రసాదంగా బిర్యానీ వంటి పసందైన వంటకాలు అందించారు. పలువురు ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొని ఖాదర్ బాబా ఆశీస్సులతో పాటు, ఆయన ప్రియ శిష్యులు అతావుల్లా బాబా వారి ఆశీర్వచనాలను పొందుకున్నారు. విజయనగరం టుటౌన్ సిఐ శ్రీనివాస్ రావు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
No comments:
Post a Comment