రూరల్ పోలీస్ సర్కిల్ చుట్టూ వివాదాలు-విషాదాలు ..!
జిల్లా పోలీస్ ప్రతిష్టపై చెరగని మరకలురాష్ట్ర , జాతీయ స్థాయిల్లో.. కుదిపేసిన ఘటనలు-దుర్ఘటనలు
మొన్న రామతీర్థం ఉదంతం
ఆపై వరుస రాజకీయ ఉద్రిక్తతలు
వరుస ఆందోళనలతో నలిగిపోయిన జిల్లా పోలీస్ లు
ఐదు సార్లు(పది రౌండ్లు) కొండెక్కి దిగిన జిల్లా ఎస్పీ రాజకుమారి
అంతకు మొన్న గుర్లలో భూ వివాదం
కాలేజీ యువతి మాయా ఉదంతం
మొన్న విజయనగరంలో రోడ్డు ప్రమాదం
నిన్న పినవేమలి యువకుడి మృతికి న్యాయం కోసం
ఎస్పీ కార్యాలయం వద్ద గ్రామస్తుల ఆందోళన
పోలీస్ శాఖను ఉక్కిబిక్కిరి చేస్తున్న వరుస ఘటనలన్నీ రూరల్ పోలీస్ సర్కిల్ చుట్టూనే అంటూ చర్చించుకుంటున్న పోలీస్ అధికారులు
పెన్ పవర్,పెన్ పవర్
విజయనగరం జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది. ఎంతో మంది ఐపీఎస్ అధికారులు తమ సర్వీస్ కాలంలో ఏదొక్క హోదాలో ఒక్కసారైనా ఈ జిల్లాలో పని చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా ఆసక్తితో ఇక్కడికి వచ్చి తమ విధి నిర్వహణలో భాగంగా అత్యంత ప్రజాదరణతో పాటు తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ఐపీఎస్ అధికారులు ఎందరో ఉన్నారు. సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, నవీన్ గులాటి, గ్రావెల్, ఎల్ కేవీ రంగారావు, పాలరాజు, ప్రస్తుత ఎస్పీ బి రాజకుమారి లాంటి ఐపీఎస్ అధికారులు తమ పనితీరు, వ్యక్తిత్వంను బట్టి ఈ జిల్లా ప్రజల హృదయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన వ్యవహార శైలీ. కానీ ప్రజల రక్షణ కోసం వీరందరిదీ ఒకటే శైలీ. అనునిత్యం ప్రజలతో మమేకం కావడమే ఈ ఐపీఎస్ అధికారుల దైనందినం. అందుకే వీరంతా ఈ జిల్లాలో సక్సెస్ ఫుల్ అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుత జిల్లా ఎస్పీగా ఉన్న బి రాజకుమారి అహో రాత్రులు ఎంత శ్రమిస్తున్నా..కొందరి పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, వ్యవహార శైలి వల్ల జిల్లా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. అవి ఒక్కోసారి జాతీయ స్థాయిలోనూ, కొన్ని సార్లు రాష్ట్ర స్థాయిలోను జిల్లా పోలీస్ శాఖకు అప్రతిష్ఠతను తీసుకు వచ్చాయనే చెప్పుకోవాలి.
ఆ క్రమంలో ఒక వైపు సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలచే శెభాష్ అనిపించుకుంటున్న జిల్లా ఎస్పీ రాజకుమారి, మరో వైపు కొన్ని ఘటనలు, దుర్ఘటనలు వల్ల విమర్శల పాలైన దుస్థితిని కూడా ఎదుర్కొన్నారనే చెప్పుకోవాలి. కోవిడ్-19 లాక్ డౌన్ లో ఎంతో సమర్థత, మానవీయతతో అహో రాత్రులు శ్రమించి జిల్లా ప్రజలను కరోనా బారిన పడకుండా రక్షించారు. వలస కార్మికులకి బాసటగా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. లెక్కకు మించి ప్రశంసలు, అవార్డులు గెలుచుకున్నారు. కానీ విజయనగరం రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో చోటుచేసుకున్న కొన్ని దుర్ఘటనలు వల్ల జిల్లా ఎస్పీగా ఆమె పడ్డ శారీరక, మానసిక ఒత్తిడి ఇంత వరకు జిల్లాలో పనిచేసిన ఏ ఒక్క ఐపీఎస్ అధికారి అనుభవించి ఉండరేమో అనిపిస్తోంది.నెల్లిమర్ల పీఎస్ పరిధిలో రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని నెల్లిమర్ల మండలంలో గల ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీరాముని విగ్రహ శిరచ్ఛేదన ఉదంతం ఎస్పీ రాజకుమారి తన సర్వీస్ కాలంలో ఎన్నడూ ఊహించని పరిణామంగానే భావించాలి. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విగ్రహ విధ్వంసం ఘటన అందరికీ విదితమే.
ఆ ఘటన వెలుగులోకి వచ్చిన మరుసటి రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమంకి విజయనగరంలో పర్యటించారు. దీంతో ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు ఇది ప్రభుత్వ అలసత్వం అంటూ, హిందూ ఆలయాలకు రక్షణ లేదని విమర్శలు చేస్తూ దానికి మతం రంగు పులిమారు. దీంతో రామతీర్థం కొన్ని దినాల పాటు ఆందోళన లతో అట్టుడికి పోయి, అది జిల్లా వ్యాప్తంగా వ్యాపించి జిల్లా కేంద్రం రణరంగాన్ని తలపించింది. దీంతో జిల్లా పోలీస్ శాఖ అంతా కంటి మీద కునుకు లేకుండా శారీరకంగా, మానసికంగా నలిగిపోయారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్న క్రమంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఐదు సార్లు అంటే పది మార్లు ఎంతైన ఆ కొండ పైకి ఎక్కి, దిగుతూ ఎంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆయితే ఎక్కడా, ఎన్నడూ శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ప్రజల రక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు.గుర్ల పీఎస్ పరిధిలో ఇదే రూరల్ పోలీస్ సర్కిల్ లోని గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రామతీర్థం ఘటనకి కొద్దీ రోజుల ముందు ఒక భూవివాదం కూడా జిల్లాను కుదిపేసింది. అది రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య వివాదాస్పద అంశంగా మారి అక్కడ పని చేసే తహసీల్దార్ తో పాటు, ఎస్సై పై చర్యలకి దారి తీసింది. ఈ స్టేషన్ పరిధిలోని దేవుని కనపాక లో ఒక వివాదాస్పద ప్రభుత్వ భూములను కొంత మంది రియల్టర్లు ఆక్రమించుకొని జేసీబీ లతో చదును చేస్తున్నారన్న సమాచారం మేరకు తహసీల్దార్ ఆ యంత్రాలను స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు కోసం గుర్ల పోలీస్ లకి అప్పగించారు. అయితే ఆ మరుసటి రోజు ఆ యంత్రాలు అక్కడ కనిపించక పోవడంతో రెండు శాఖల మధ్య వివాదం చెలరేగి భూ ఆక్రమణల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ భూ దందా వెనుక ఒక పోలీస్ ఉన్నతాధికారి హస్తం ఉందని, అందుకే ఆ యంత్రాలను వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు తదుపరి అక్కడ పనిచేసిన ఎస్సై ను తిరిగి అక్కడే పునర్నియమించడంతో మండల ప్రజలను విస్మయానికి గురి చేసింది.కాలేజీ యువతి మాయా ఉదంతం ఇక ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కాలేజీ విద్యార్థిని చేసిన గమ్మత్తు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీంతో ఆ కేసును ఛేదించడానికి జిల్లా పోలీస్ శాఖ తీవ్రంగా శ్రమించి సక్సెస్ అయింది. కాలేజీ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తూ అదృశ్యమైన ఆ యువతి, ఇంట్లో మందలిస్తారన్న భయంతో తనకు తానుగా కాళ్ళు చేతులు బందించుకుని పొదల్లో అచేతన స్థితిలో కనిపించింది. ఈ ఉదంతం జిల్లా పోలీస్ శాఖను ఉలిక్కి పడేలా చేసింది. దీంతో ఎస్పీ రాజకుమారి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయించి, అది ఆ యువతి సృష్టించుకున్న ఘటనగా తేల్చారు.విజయనగరం రూరల్ పీఎస్ పరిధిలో ఇదే రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో తాజాగా సోమవారం చోటు చేసుకున్న ఒక పెను విషాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం కలవర పాటుకు గురి చేసింది. విశాఖ, విజయనగరం జాతీయ రహదారి పై రూరల్ లిమిట్స్ లోని సుంకర పేట వద్ద రెండు బస్సులు, ఒక గ్యాస్ లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గరు దుర్మరణం పాలవ్వగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పై ఎస్పీ రాజకుమారి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమించారు. విశాఖ రేంజ్ డీఐజీ ఎల్ కేవీ రంగారావు కూడా విజయనగరం వచ్చు క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటన కూడా పోలీస్ అధికారులను తీవ్ర మానసిక ఆవేదనకు గురి చేసింది.ఇక ఇదే విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పినవేమలి లో మార్చ్ 14 న ఒక యువకుడి అనుమానాస్పద మృతి ఘటన చోటుచేసుకుంది. విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రి ఒక రాజకీయ పార్టీకి చెందిన యువకుడు ఆ మరునాడు ఒక బావిలో అనుమానాస్పద స్థితిలో నిర్జీవంగా కనిపించాడు. అతడిది సహజ మరణం, ఆత్మహత్య కాదు హత్య అని బంధువులు రూరల్ పోలీస్ లకి పిర్యాదు చేసారు. అయితే ఈ ఘటన పై ఎటువంటి పురోగతి లేకపోవడంతో మృతుని బంధువులు తాజాగా మంగళవారం జిల్లా ఎస్పీకి పిర్యాదు చేయడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలంటే ఎస్పీ కార్యాలయం వెలుపట నినందించారు.ఇలా వరుస ఘటనలు, దుర్ఘటనలు విజయనగరం రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో చోటుచేసుకోవడం అవి జిల్లా పోలీస్ శాఖను అప్రతిష్ట చేసేవిగా ఉండడంతో ఇప్పుడు అందరి చూపులు, విమర్శలు రూరల్ సర్కిల్ పైన పడ్డాయి. జిల్లా ఎస్పీగా రాజకుమారి ఎంతో శ్రమించి ఎన్నో ప్రజాకర్షక, ప్రజా రక్షక, మహిళా రక్షక కార్యక్రమాలు చేపడుతూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకు వస్తుంటే..కొందరి పోలీస్ అధికారుల అసమర్థత, అలసత్వం, అవినీతి వలన ఆ మంచి పేరు కాస్తా ఆవిరవుతోందని అంతా చర్చించుకుంటున్నారు. వీటిని పోలీస్ ఉన్నతాధికారులు ఏ దృష్టితో చూస్తున్నారో కాలమే చెప్పాలి.
No comments:
Post a Comment