కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
పెన్ పవర్, కందుకూరుకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు కొరకు ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ అడ్డుకోవాలని కోరుతూ ఈనెల 26వ తేదీన జరిగే భారత బంద్ ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం సింగరాయకొండ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రంగారావు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాల వలన రైతులు, రైతు కూలీలే కాకుండా పేద మధ్యతరగతి, కార్మిక వర్గానికి తీవ్ర నష్టం అని అన్నారు. బ్లాక్ మార్కెట్ పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని అన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు వీరారెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నా నరేంద్ర మోడీ కి గాని నిర్మలా సీతారామన్ కు చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు.
వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయని ప్రజల మీద అధిక భారం పడుతుందని అన్నారు. ఈనెల 26వ తేదీన జరిగే భారత్ బంద్ కొండేపి నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో జయప్రదంగా నిర్వహించాలని అందుకు బ్యాంకులు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ప్రజలు, వ్యాపార వర్గాల వారు వివిధ కళాశాలల, స్కూలు యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె నాంచారులు, జై భీమ్ పీపుల్స్ జెఎసి అధ్యక్షులు అంబటి కొండల రావు యువజన కాంగ్రెస్ నాయకులు రసూల్, ఏ ఐఎఫ్టియు నాయకులు సుల్తాన్ భాష ఏఐటీయూసీ నాయకులు మీరా ప్రజా సంఘాల నాయకులు సుల్తాన్ ,సుభాన్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment