Followers

రాష్ట్ర ప్రభుత్వం పెర్క్స్ పై ఐటీ మాఫీ చేయాలని సింగరేణికీ ఆదేశాలు జారీ చేయాలి

 రాష్ట్ర ప్రభుత్వం  పెర్క్స్ పై ఐటీ మాఫీ చేయాలని సింగరేణికీ ఆదేశాలు జారీ చేయాలి


మందమర్రి,  పెన్ పవర్

సింగరేణి కార్మికులకు పూర్తి ఐటి రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేశామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న పెర్క్స్ పై ఆదాయపు పన్ను రద్దు చేయమని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కేకే 1 గనిపై నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన బంద్ పిలుపుకు బొగ్గు గని కార్మికులు మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులు కొనసాగిస్తున్న పోరాట స్ఫూర్తి తోనే కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మొదటి దశ బొగ్గు గనుల వేలం పాటలు పూర్తయ్యాయని, రెండోసారి వేలం పాటలు వేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదన్నారు. బొగ్గు గనుల వేలం వలన ప్రభుత్వ రంగాలైన కోలిండియా, సింగరేణికి కొత్త గనులు రాక పూర్తిస్థాయిలో ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉందని, దాని ఫలితం వేజ్ బోర్డ్ పై కూడా పడే అకాశం కచ్చితంగా ఉంటుందన్ని పేర్కొన్నారు. ఇప్పటికే బొగ్గు రంగంలో ప్రైవేటు వారికి 34 శాతం పైగా వాటాలు  ఉండడం వలన వేతనాలు పెంపునకు వారు అంగీకరించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఒక వైపు ధరలు ఆకాశాన్నంటుతుంటే, కార్మికులకు పెంచాల్సిన డిఎ పెంచకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు వేలం పాటలకు అనుగుణంగా చట్టాలను మారుస్తుంటే వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తామేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తూ, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను పార్లమెంటులో వ్యతిరేకించకుండా, కనీసం రాష్ట్ర అసెంబ్లీ లోనైనా బొగ్గు గనుల వేలం పాటకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపకుండా, కొత్త గనుల అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి  తీసుకు రాకుండా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సింగరేణిని కొల్లగొడుతున్నరని ఆరోపించారు.సింగరేణి కార్మికులకు 2021 సంవత్సరం క్యాలెండర్ ఇవ్వలేదని, ఇప్పటికే రిటైర్డ్ కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించలేదని, కార్మికులకు సిఎంపిఎఫ్ చిట్టిలు ఇవ్వలేదన్నారు. ఎన్ఓసి జారీలో జాప్యం తగ్గించి, ఏరియా జియంలకు అధికారాలు ఇవ్వాలని, నూతనంగా విధుల్లో చేరిన కార్మికులు స్పెషల్ ఆలవెన్స్ విషయంలో నష్టపోతున్నారని పేర్కొన్నారు. బొగ్గు గనుల సంరక్షణకు, సమస్యల పరిష్కారానికి కార్మికులు భవిష్యత్తులో కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులకు మద్దతు తెలపాలని, ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని తెలిపారు. అనంతరం సింగరేణి లోని పలు సమస్యల పై కేకే-1 గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, నాయకులు గుళ్ల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...