ఎవరి స్వప్రయోజనాల కోసం ఈ రోడ్డు నిర్మాణం
"మీరు కబ్జా చేసుకోండి.. మేము చూస్తూ ఊరుకుంటాం" అనే రీతిలో అధికారుల తీరు
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలంలోని నాయుడుపాలెం రాముడి చెరువు గట్టుపై కొందరి స్థిరాస్తి వ్యాపారానికి ఉపయోగపడేలా రోడ్డు ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల సిఫార్సు మేరకు ప్రభుత్వ నిధులు కేటాయించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు బహిరంగ చర్చ జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే కాలువలు, గెడ్డలు, వాగులు. చెరువు గట్లు తదితర ప్రభుత్వ వనరులను బడా బాబులకు దోచి పెట్టడానికే అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుందనిపిస్తోంది. ప్రజా ప్రయోజనాల పేరుతో సుమారు పది అడుగులు వెడల్పు ఉన్న చెరువు గట్టుపై నున్న రహదారిని 16 అడుగులు వరకు పెంచడం దేనికోసం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కబ్జాకు గురై బక్క చిక్కిన రాముడుగారి చెరువుని రైతులకు రోడ్డు పేరుతో రియలర్టర్లకు ఉపయోగపడే విధంగా నాయకులు, అధికారులు ప్రయత్నించడం ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేయడానికే చెరువు గట్టుని చదును చేసి వెడల్పుగా చేస్తున్నారని, ఈ క్రమంలో చెరువు గట్టుపై దశాబ్దాలుగా ఉన్న తాటి చెట్లను కూడా తొలగించారని ఆరోపిస్తున్నారు. పైగా ఈ రహదారి కోసం ఆ రియలర్టర్ నుంచి భారీగా సొమ్ములు చేతులు మారాయని తెలుస్తోంది. .ఇప్పటి కైనా జిల్లా ఉన్న తాధికారులు స్పందించి రాముడుగారి చెరువు గట్టుపై రైతుల పేరుతో జరుగుతున్న రియల్ రహదారి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
No comments:
Post a Comment