వార్డు పర్యటనల పట్ల ప్రజలలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సమస్యల పరిష్కారం
విజయనగరం,పెన్ పవర్నగరంలో తాము చేస్తున్న వార్డు పర్యటనల పట్ల ప్రజలలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి వెల్లడించారు. వార్డు పర్యటనలలో భాగంగా శనివారం నాడు 24 వ డివిజన్ లోని బూర్ల పేట తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత సమస్యలను అక్కడున్న ప్రజలు ఎమ్మెల్యే కోలగట్ల దృష్టికి తీసుకుని వచ్చారు. జైలు గోడ నుండి పౌరసంబంధాల శాఖ కార్యాలయం వరకు కాలువ లేదని స్థానికులు చెప్పడంతో వెంటనే కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇంటి నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేవా అని ప్లానింగ్ సెక్రటరీని ప్రశ్నించగా అక్కడే ఉన్న టిపియస్ సమాచారం సేకరిస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు. తాను పర్యటన చేసేంత వరకు నిర్మిత భవనానికి అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోలేకపోవడం, సంబంధిత అధికారి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.అదేవిధంగా ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు లేవని మహిళలు చెప్పడంతో వెంటనే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆ ప్రాంతంలో కాలువ నిర్మాణం సరిగా లేకపోవడం గమనించిన ఎమ్మెల్యే సిబ్బంది పిలిచి అదే సమయంలో కాలువలో పూడిక తీయించి, కల్వర్టు నిర్మాణం సక్రమంగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. అనంతరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగే విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వార్డు పర్యటన చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా అనంతర కాలంలో కూడా ప్రజల వద్దకు నేరుగా నాయకులే వెళ్లి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నాయకుల పట్ల నమ్మకాన్ని పెంచుతున్నామన్నారు. 24 వ వార్డులో ప్రజా సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించినట్లు చెప్పారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్టులో పర్యటనలు చేసి ఆయా ప్రాంతాలలో సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన చొరవ చూపుతున్నామన్నారు. తాము చేస్తున్న పర్యటనలలో అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, అందువలన సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పిళ్లా రాధాభవాని, జోనల్ ఇంచార్జ్ మరియు కార్పొరేటర్ కె. తవిటి రాజు, వైసీపీ నాయకులు పిల్లా వేణు, నగరపాలక సంస్థ ఆయా విభాగాల అధికారులు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment