కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న సింగరేణి యాజమాన్యం
మందమర్రి, పెన్ పవర్ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అంటూ చెప్పే సింగరేణి యాజమాన్యం కోల్ ఇండియా ఒప్పందాలలో సంతకాలు పెట్టి, అట్టి ఒప్పందాలను సింగరేణిలో అమలు చేయకుండా కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్ ఆరోపించారు. శనివారం మందమర్రి ఏరియాలోని కేకే ఓసిపి,ఏరియా వర్క్ షాప్ లలో వేర్వేరుగా ద్వార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోల్ ఇండియాలో సిఐటియు ఇతర జాతీయ సంఘాలను కలుపుకొని వేజ్ బోర్డు లో పేర్క్స్ మీద ఐటీ రియంబర్స్మెంట్ చేయాలన్న ఒప్పందాన్ని ఒకే కుటుంబం అని చెప్పుకునే యాజమాన్యం సింగరేణిలో కార్మికులకు మాత్రం అమలు చేయమంటే, వేజ్ బోర్డు లో సంతకం చేసి, సింగరేణిలో మాత్రం లోతైన అధ్యయనం చేయాలంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ, అధికారులకు అమలు చేస్తుంటే, దీనికి గెలిచిన సంఘాలు వత్తాసు పాడుతున్నాయని ఘాటుగా విమర్శించారు. ఆదాయపు పన్ను భారంతో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే, కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉన్నది అని గొప్పలు చెప్పుకొనె తెలంగాణ ప్రభుత్వం కొత్త గనుల గురించి కేంద్రం పై ఒత్తిడి చేయడం లేదని, తన ఆధీనంలోని సింగరేణికి కార్మికులకు అనుకూలమైన ఐటి రియంబర్స్మెంట్ చేసే ఒప్పందాన్ని సింగరేణిలో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. యాజమాన్యానికి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు కార్మికులకు ప్రతి సంవత్సరం మాదిరి ఇన్సెంటివ్ ఇచ్చే ఆనవాయితీ ఎందుకు దాటవేసిందని ప్రశ్నించారు. మున్సిపాలిటీ ప్రకారము ఇంటి అద్దె కేకే ఓసిపి కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పలు సమస్యల పైన కేకే ఓసిపి మేనేజర్,ఏరియా వర్క్ షాప్ డిజిఎం కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, నాయకులు రాజమల్లు, సంకె రవి, గూళ్ల బాలాజీ, సింగ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment