ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
కూకట్ పల్లి, పెన్ పవర్
పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కూకట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం కూకట్ పల్లి ఏసిపి కార్యాలయంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కడపజిల్లా వెంపల్లికి చెందిన బడి.వంశీరెడ్డి(48)అనే వ్యక్తి బాచూపల్లిలోని ఎల్లమ్మ గుడి గల్లీలో నివాసం ఉంటూ వాచ్ మెన్ గా, కొన్ని సార్లు క్యాటరింగ్ లో పని చేస్తున్నాడు. వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళాల సహాయంతో తస్కరించేవాడు. ఈ క్రమంలో దొంగతనం చేసిన హోండా యాక్టివా వాహనం పై జగదిగిరి గుట్ట నుండి కూకట్ పల్లి వైపు వస్తుండగా వైజంక్షన్ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో కూడా వివిధ పోలీసు స్టేషన్ ల పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి జైలుకు వెళ్లినట్టు గుర్తించారు. జైలుకు వెళ్లివచ్చిన సరే పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతుండటంతో నిందితుడిపై పీడియాక్ట్ ప్రయోగిస్తామని అన్నారు. నిందితుడి వద్ద నుండి సుమారు ఏడూ లక్షల రూపాయలు విలువచేసే తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఏసిపి సురేందర్ రావు, కూకట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment