రాష్ట్రంలో రాక్షస పాలన
విజయనగరం,పెన్ పవర్
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షసపాలన కొనసాగిస్తోందని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి అదితి గజపతిరాజు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం డివిజన్లో, సాయంత్రం 5, 8, 10 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అసమర్ధత వలన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పెరిగిన నిత్యవసర ధరలను నియంత్రించలేని స్థితిలో వైకాపా పాలకులు ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే టీడీపీ గెలుపునకు సోపానాలన్నారు. పోలీసు, అధికార వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పధకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఎవరి సొమ్ముతో పధకాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు. వాలంటీర్లతో ప్రలోభపెట్టే కుట్రలను సాగనివ్వమన్నారు. వైసీపీకి దమ్ముంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్రత్యేక హెూదా వచ్చేలా చూడాలని సవాల్ విసిరారు. వైకాపా పాలనలో ఇసుక, సిమ్మెంట్, గ్యాస్, డీజిల్, పెట్రోల్, వంటనూనె ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం పడుతోందన్నారు. పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే విజయనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని ఒత్తిడులు చేసినా టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తూ విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బలివాడ లలిత, 5వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఎస్.సాయి నాగ బుచ్చిరాజు, 8వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి నంబూరి నాగమణి, 10వ డివిజన్ అభ్యర్థి సుంకరి సునీత, టీడీపీ నాయకులు ఐవిపి రాజు, ప్రసాదుల కనక మహాలక్ష్మి, కరణం శివరామకృష్ణ, బలివాడ అప్పారావు, వారణాసి మల్లిబాబు, ప్రసాదుల ప్రసాద్, విజ్ఞపు ప్రసాద్, బొద్దల నర్సింగరావు, రౌతు నర్సింహమూర్తి, గంటా పోలినాయుడు, కిలాన మహేష్, రాజేష్, తెలుగు యువత నాయకులు, నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment