కేసును చేధించిన కూకట్ పల్లి పోలీసులు
కూకట్ పల్లి,పెన్ పవర్
నిర్లక్ష్యంగా ఆటో తోలుతూ ఓవ్యక్తిని ఢీకొట్టి హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సింది పోయి కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని డంప్ యార్డులో పడేసి వెళ్లిన ఘటన కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం కూకట్ పల్లి పోలీసు స్టేషన్లో ఏసిపి సురేందర్ రావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మియపూర్ జనప్రియ నగర్ లో నివసిస్తున్న కాకర.రామకృష్ణ జనవరి ఆరో తేదీన ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. రామకృష్ణ సోదరుడు చుట్టుపక్కల ఆచూకీ కోసం గాలించిన లాభంలేకపోవడంతో మియపూర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. అయితే ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి వెళ్లిన రామకృష్ణను మియపూర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద రోడ్డు దాటుతుండగా న్యూ హఫీజ్ పెట్ కు చెందిన సయ్యద్ షేర్ అలీ అనే వ్యక్తి ఆటోతో ఢీ కొట్టాడు. దీనితో స్థానికులు అలీని పట్టుకుని తీవ్రంగా గాయపడిన రామకృష్ణ ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళమంటే సరే అని తన ఆటోలో ఎక్కించుకుని వెళ్ళాడు. అయితే రామకృష్ణను హాస్పిటల్ కు తీసుకెళ్తే తనమీద కేస్ అవుతుందని, వైద్య ఖర్చులు కూడా తనే భరించాల్సి వస్తుందనే భయంతో కోన ప్రాణంతో ఉన్న రామకృష్ణను కైతలాపూర్ డంపింగ్ యార్డ్ లో పడేసి వెళ్ళిపోయాడు. డంపింగ్ యార్డ్ లో రామకృష్ణ మృతదేహాన్ని చూసిన పోలీసులు ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించి రెండు నెలల పాటు శ్రమించి ఆటో డ్రైవర్ అలీని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఒక ఆటోను, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలిస్తునటు తెలిపారు. రెండు నెలల పాటు నిరంతరం శ్రమించి కేసును చేధించిన పోలీసు సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ప్రజలు కూడా ప్రయాణం చేసే సమయంలో రోడ్డు మీద ఎవరైనా గాయపడినట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని, లేదా వెంటనే వారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లి వారి ప్రాణాలు కాపాడాలని ఆయన అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment