విశాఖ ఉక్కు కోసం కదంతొక్కిన విలేఖరులు
నర్సీపట్నం, పెన్ పవర్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న విశాఖ జిల్లా బంద్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలిపింది. వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు జిల్లా వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నర్సీపట్నంలో జాబ్ యూనియన్ సభ్యులు, వారికి మద్దతుగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ముందుగా జాప్ రాష్ట్ర కార్యదర్సి యలమంచిలి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరి రామకృష్ణ అబీద్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, మానవహారంగా ఏర్పడ్డారు. రాస్తారోకో నిర్వహించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం జాప్ నాయకుడు వేణు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉంటే, దానికి సొంత గనులు కేటాయించి ఆదుకోవాలి గానీ, ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఈ కర్మాగారం ఏర్పడిందని గుర్తు చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన భారీ ఉద్యమ ఫలితమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, దశల వారీగా ఉద్యమ నిర్మాణం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవ అద్యక్షులు ఎం.అప్పలరాజు, అద్యక్షులు గొర్లి రాజు, కార్యదర్సి లంక శివకుమార్, కోశాధికారి కోట్ని రాజశేఖర్, ప్రెస్ క్లబ్ గౌరవ అద్యక్షులు వర్రే రమణ, కార్యదర్సి జామిశెట్టి శ్రీధర్ మరియు పులిగా మురళి, జె.శంకర్, రవిశేఖర్, కడిమిశెట్టి తాతాజీ, పి.గోవింద్, ఎల్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment