రాజకీయాలకతీతంగా, అవినీతి రహిత పాలన
పెన్ పవర్,విజయనగరంరాజకీయాలకతీతంగా, అవినీతి రహితంగా పాలన అందిస్తామని నగరపాలక సంస్థ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పేర్కొన్నారు. మేయర్ అధ్యక్షతన మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం జరిగింది. ముందుగా మేయర్ విజయలక్ష్మి అధ్యక్ష స్థానాన్ని అధిరోహించగా, స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అభినందనలు తెలిపారు. నగర పాలక సంస్థ అధికారులు సభకు పరిచయం చేసుకున్నారు. అనంతరం అజెండా అంశాలను ప్రస్తావించగా టిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు టిడ్కో ఇళ్ల మంజూరు విషయమై సభ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళు అందిస్తున్నట్లు చెప్పారు.
ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అజెండాలోని ప్రతిపాదిత అంశాలను ప్రస్తావించగా కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా డస్ట్ బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. వార్డు సభ్యులు అందరి సూచనలు, సలహాలతో చెత్త సేకరణ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.ప్రభుత్వం నిర్దేశించిన క్లాప్ ప్రోగ్రామ్ శతశాతం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం శాసనసభ్యులు కోలగట్ల మాట్లాడుతూ నగరంలో హరిత విజయనగరం పేరిట విరివిగా మొక్కలు నాటామని అయితే మొక్కలు పెంచే క్రమంలో అలసత్వం వహించిన వర్క్ ఇన్స్పెక్టర్ రవి నిర్లక్ష్య ధోరణి తో విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, దీని మూలంగా నాటిన మొక్కలు ఎండి పోయాయని సభ దృష్టికి తీసుకొని వచ్చారు.
అనుకున్న లక్ష్యం నెరవేరక పోగా విధుల పట్ల అలసత్వం వహిస్తున్న తీరును సభ ముందుంచారు. ఈ విషయమై స్పందించిన 15 వ వార్డు కార్పొరేటర్ అల్లు చాణక్య మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వర్క్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేయాలని కోరారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ విధుల పట్ల అధికారుల అలసత్వం గా ఉంటే ప్రభుత్వ విధానాలు, పాలన తీరు సత్ఫలితాలు ఇవ్వవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలకవర్గంలో ప్రజా సేవ తో పాటు ఉత్సుకత కలిగిన కార్పొరేటర్లు ఉన్నారని అన్నారు.
అందుకోసమే అధికారులు, కార్పొరేటర్లు మధ్య స్నేహ పూర్వక అభివృద్ధి సాగాలన్నదే తన అభిమతమని అన్నారు. తాము అధికారం చేపట్టాక 2020లో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేశామని,అదే పరిస్థితి ప్రస్తుత వేసవిలో కూడా ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. ఇందుకోసమే తోటపల్లి,ఆండ్ర ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయించేందుకు కృషి చేశామన్నారు. త్వరలోనే తోటపల్లి నుండి గడిగెడ్డకు నీరు వస్తుందని దీంతో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. అయితే తాగునీరు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే అని స్పష్టం చేశారు. ప్రధానంగా ఆన్ ఆఫ్ హెడ్ లు సరిచేయాలని చెప్పారు. తాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తమకు ప్రజా శ్రేయస్సే ముఖ్యమని పునరుద్ఘాటించారు.
అదేవిధంగా నగరం అభివృద్ధి చెందాలంటే అందుకు పన్నుల వసూళ్ళు ముఖ్యమని అన్నారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. మరో ప్రధాన విషయమైన భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ప్రతి నిర్మాణం వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేవిధంగా చొరవ చూపాలన్నారు.ఇంకుడు గుంతలు లేకుంటే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని,ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కూడా నిలుపుదల చేయాలని అధికారులకు సూచించారు. వార్డులలో సామూహిక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నట్లయితే అధికారుల దృష్టికి కార్పొరేటర్లు తీసుకు
సీనియర్ కార్పొరేటర్ ఎస్ వి వి రాజేష్ మాట్లాడుతూ శాసనసభ్యుల సూచనలు సలహాలతో అందరూ సమిష్టిగా కృషి చేసి విజయనగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. 29వ వార్డు కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన క్లాప్ కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తామన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తూ ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ సమావేశంలో 47 వ వార్డు కార్పొరేటర్ పట్నాన పైడ్రాజు, 23 వ వార్డు కార్పొరేటర్ సీతారామమూర్తి, 30 వ వార్డు కార్పొరేటర్ పతివాడ గణపతి రావు,మాట్లాడారు. 49 వ వార్డు టిడిపి కార్పొరేటర్ కర్రోతు రాధ మణి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన క్లాప్ కార్యక్రమం విజయవంతమైనట్లైతే నగరం పారిశుద్ధ్య రహితంగా రూపుదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి, వివిధ వార్డుల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ప్రసాద్ రావు, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ, ఈఇ డాక్టర్ కిలాన దిలీప్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వరరావు, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, గణాంక అధికారి రోజా వెంకటలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment