ఉన్నత ప్రమాణాలతో రహదారుల నిర్మాణాలు
పెన్ పవర్,కాకినాడ
ఉన్నత ప్రమాణాలతో పర్యావరణానికి హాని జరక్కుండా రహదారుల నిర్మాణ ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) అధికారులకు సూచించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టును ఎన్‌హెచ్ 16తో అనుసంధానించే ప్రాజెక్టులో భాగమైన సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ నాలుగు లైన్ల రహదారి నిర్మాణ ప్రణాళికపై శుక్రవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామర్లకోట నుంచి అచ్చంపేట వరకు దాదాపు 11.3 కిలోమీటర్ల మేర జరిగే రహదారి నిర్మాణంతో ఇప్పటికే ఏర్పాటై ఉన్న పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్‌హెచ్ఏఐ రూపొందించిన అలైన్‌మెంట్ బాగుందని పేర్కొన్నారు. కొత్త రహదారి నిర్మాణం వల్ల జీవీకే పవర్‌ప్లాంట్, భారత ఆహార సంస్థ, ర్యాక్ సిరామిక్స్, చక్కెర కర్మాగారాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే రహదారుల నిర్మాణాలకు సంబంధించి వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని, ఇలాంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ప్రాంతాలు ప్రగతి పథంలో పయనిస్తాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పాత రహదారి వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయన్నారు. కొత్త రహదారి నిర్మాణం వల్ల ఈ సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించారు. ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించే భారత ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంలో భాగమైన ఎన్‌హెచ్ 16-కాకినాడ పోర్టు (రాజానగరం-సామర్లకోట-అచ్చంపేట-కాకినాడ పోర్ట్ రోడ్) ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టులోని రాజానగరం ఎన్‌హెచ్ 16 జంక్షన్ నుంచి సామర్లకోట వరకు రహదారిని ఏపీఆర్‌డీసీ చేపడుతుండగా, అచ్చంపేట-కాకినాడ పోర్టు వరకు రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్ఏఐ బిడ్లను ఆహ్వానించిందని వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో భాగమైన సామర్లకోట నుంచి అచ్చంపేట వరకు రహదారి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రణాళిక వివరాలను ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ (రాజమహేంద్రవరం) డి.సురేంద్రనాథ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పాత రహదారి స్థితిగతులు, కొత్త రహదారి అలైన్‌మెంట్, అవసరమైన భూమి, సేకరించాల్సిన భూమి, ఆర్‌వోబీలు తదితర వివరాలను అందించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వర్ నాయక్, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, పెద్దాపురం ఆర్‌డీవో ఎస్.మల్లిబాబుతో పాటు ఎన్‌హెచ్ఏఐ, గుడా, పోలీస్, ఎఫ్‌సీఐ, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment