Followers

భారత్ బంద్ కు మద్దతుగా విశాఖ నగర కాంగ్రెస్

 భారత్ బంద్ కు మద్దతుగా విశాఖ నగర కాంగ్రెస్... సంకు వెంకటేశ్వర రావు

మహారాణి పేట, పెన్ పవర్

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక  విధానాలకు వ్యతిరేకంగా కార్మిక,కర్షక,ఉద్యోగ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బందుకు విశాఖ ప్రజలు భారీగా స్పందించారు.విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని మద్దతు తెలిపారు.నగర అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర రావు సారధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సరస్వతి పార్క్,జగదాంబ జంక్షన్, వెంకటేశ్వర మెట్ట ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి బ్యాంకులు,దుకాణాలు,ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు.బ్యాంకుల సిబ్బంది, దుకాణదారులు కూడా బందుకు మద్దతు తెలుపుతూ తమ,తమ దుకాణాలను మూసివేశారు.అనంతరం జగదాంబ జంక్షన్లో  ధర్నా నిర్వహించి కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.విశాఖ ఉక్కు,రైతు వ్యతిరేక బిల్లులు,కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జగదాంబ జంక్షన్ ను స్తంభింపచేసారు.

ఈ సందర్భంగా సంకు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ  రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నవంబర్ 26 న ఢిల్లీలో 120  రోజులుగా అన్నదాతలు  ఉద్యమం చేస్తున్నా,300 మంది రైతన్నలు ప్రాణ త్యాగం చేసినా ప్రదాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం దారుణమన్నారు. దేశంలోని రైతాంగం తీవ్ర పోరాటం చేస్తుంటే  నిర్లక్ష్యంగా ప్రధాని వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.మానవత్వం లేకపోవడం మోడీకే చెల్లిందన్నారు.బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వే, పరిశ్రమలు,టెలికం,రోడ్లు, విద్యుత్ వంటి లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను తన అనునూయులకు కట్టబెట్టేందుకు భారీ ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు.ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదువుకుని,చదువుకుంటున్న నిరుద్యోగులకు భవిష్యత్తులో  ప్రభుత్వ ఉద్యోగాలు కలగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేసారు.ప్రైవేటు రంగంలో ఇప్పటివరకూ  ఆరు లక్షల కంపెనీలు మూసేసారని,కోట్ల ఉద్యోగాలు పోయాయన్నారు.

ఉద్యోగులను ఎప్పుడైనా ఎవరికి చెప్పకుండా తొలగించేయవచ్చు అనే  "హయ్యర్ అండ్ ఫైర్" విధానంలో కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించారని దుయ్యబట్టారు.కార్మికులకు అనుకూలంగా ఉన్న  కార్మిక చట్టాలను మార్చి యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారన్నారు.పెట్రోల్, డిజీల్, గ్యాస్ పై ఇష్టారీతిన ధరలు పెంచి సామాన్యులను దోచుకుంటున్నారని విమర్శించారు.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు  తగ్గినా దేశంలో మాత్రం టాక్స్ ల పేరుతో దోచుకుంటున్నారన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను గాలికొదిలేశారని,ప్రత్యేక హోదా,రైల్వే జోన్,కడప ఉక్కు,మెట్రో రైల్  తదితరాలను అటకెక్కించేసారని విమర్శించారు.పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విదేశీ కంపెనీ పోస్కో కు ధారాదత్తం చేయడంపై సంకు మండిపడ్డారు. కృష్ణ పట్నం,గంగవరం పోర్టు లను కూడా ప్రైవేటు పరం చేశారన్నారు.తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన రాజధాని కి సహకరిస్తామని చెప్పి మాటమార్చి  దేవుళ్లను కూడా మోసం చేసారన్నారు.దేశ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే సుఖ సంతోషాలతో జీవించారన్నారు.ప్రజావ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకునేవరకూ,విశాఖ ఉక్కు ప్రవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతుందని సంకు తెలిపారు.సోదదాసు సుధాకర్,గోళ్లకోట సుబ్బారావు,గాదం మహేష్,మొహిద్దీన్,బిపిన్ కుమార్,అస్మత్ అలీ,బొమ్మిడి గంగాధర్,శ్రీను, వెంకటేష్,నూకరాజు,సరస్వతమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను దుమ్మెత్తి పోశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...