Followers

తాజ్ ఖాదర్ వలి బాబా వారి 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు

  తాజ్ ఖాదర్ వలి బాబా వారి 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు 

విజయనగరం,పెన్ పవర్

 విజయనగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం బాబామెట్ట  దర్గా, దర్బార్ లో సూఫీ మహనీయులు హజరత్  తాజ్ ఖాదర్ వలి బాబా వారి 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు  నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు దర్గా, దర్బార్ ముతవల్లి(ధర్మకర్త) మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్ధనలతో ఈ మహోత్సవాలు ప్రారంభమౌతాయని ఆయన తెలిపారు. అటు తర్వాత జెండా ఉత్సవం, ఛాదర్ సమర్పణ వంటి ఉత్సవ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రెండో రోజు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖాదర్ బాబా దర్గా షరీఫ్ వద్ద ఖురాన్ పఠనం వుంటుందని తెలిపారు. దర్గాలో సుగంధ మహోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు, సర్వ మానవాళి క్షేమం కోసం, దేశం సుభిక్షంగా ఉండాలని సూఫీ ప్రచారకులచే ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం 10 గంటలకు దర్భార్ షరీఫ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ వాహనంపై ఆశీనులై ఉన్న సూఫీ మహనీయులు, భగవత్ స్వరూపులు హజరత్ తాజ్ ఖాదర్ వలీ బాబా వారిని నషాన్, చాదర్, సందల్ షరీఫ్ లతో పాటు ఫకీరు మేళా ఖవ్వాలితో నగర పుర వీధుల్లోకి ఊరేగింపు బయలుదేరి వెళ్తుందని  పేర్కొన్నారు. ఉత్సవాలకు తరలి వచ్చే వేలాది మంది భక్తజనులుకి భారీ లంగర్ ఖానాలో మహాన్నదాన క్రతువుని నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా మూడో రోజు గురువువారం కూడా దర్గాలో పవిత్ర ఖురాన్ పఠనంతో బాబా వారి పూజా కార్యక్రమాలు మొదలవుతాయని తెలిపారు. చాదర్ సమర్పణ, దుప్తార్ బందీ, సలాం వంటి కార్యక్రమాలతో ఉరుసు మహోత్సవాలు ముగిస్తాయని ధర్మకర్త అతావుల్లా బాబా పేర్కొన్నారు.

దేశ విదేశాల, రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే ఈ ఉరుసు వేడుకలకి ఈ ఏడాది కోవిడ్ కారణం అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని దర్గా, దర్భార్ షరీఫ్ షా నిర్వాహకులు, ఏటికే సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఎండీ ఖలీలుల్లా బాబు(ఖలీల్) తెలిపారు. ఆశ్రమం పరిసరాలన్నీ సానిటైజ్ చేయడం జరిగిందని తెలిపారు. మూడు రోజుల పాటు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అనారోగ్యంతో ఉన్న వారు, వృద్ధులు, పిల్లలను ఉత్సవాలకు తీసుకు రావద్దని భక్తులకు సూచించామన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల సూచన మేరకు వీలైనంత వరకు అధిక జన రద్దీ లేకుండా ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కొన్ని కీలకమైన ప్రాంతాలను వచ్చే భక్తులను పూర్తిగా నిలిపివేసినట్టు తెలిపారు. కాగా ప్రస్తుతం దర్భార్ లంగర్ ఖానాలో జరుగుతున్న అన్నదాన మహా సమారాధన ఈ మూడు రోజుల పాటు మరింత ఘనంగా, భారీగా నిర్విరామంగా జరుగుతుందని ఖలీల్ బాబు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...