మహా శివరాత్రి జాతరకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి
సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమవ్వాలి
మూలవాగు ప్రాంతంలో ఉన్న చెత్తను శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలి
పార్కింగ్ స్థలంలో లెవెలింగ్ చేయించాలి
ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే తో కలిసి తిప్పాపూర్ బస్టాండ్, పార్కింగ్ స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్
భక్తులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా (పెన్ పవర్)/
దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా లోనీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మార్చి నెల 10,11,12 తేదీలలో నిర్వహించబోయే మహాశివరాత్రి జాతర సందర్భంగా సంబంధిత అధికారులు జాతర నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే లు ఆదేశించారు.
మంగళవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతం, గుడి చెరువు శివారులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ లు సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
మూలవాగు ప్రాంతంలో ఉన్న చెత్తను శుభ్రపరచాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. గుడి చెరువు శివారులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని లెవెలింగ్ చేయించాలని సూచించారు. అక్కడ ఉన్నటువంటి బావి లో ఉన్న మురుగు నీటిని సిల్టింగ్ మోటార్ల ద్వారా లిఫ్టింగ్ చేయించాలని ఆదేశించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం 80 తాత్కాలిక బాతింగ్ షవర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఫైర్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మాక్ డ్రిల్స్ గురించి ఆరా తీశారు.
జాతరకు ముందుగానే సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమవ్వాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి జాతరను విజయవంతం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ లు ఆదేశించారు.
ఈ సందర్శనలో అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీఎస్పీ చంద్రకాంత్, ఆర్డీఓ శ్రీనివాస రావు, మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, డిపో మేనేజర్ భూపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment