Followers

సన్ స్ట్రోక్..?

 

సన్ స్ట్రోక్..?



 

కొడుకు రూపంలో ఆ ఎమ్మెల్యేకి కొండంత కష్టం వచ్చిందా ...?

కుమారుడిపై నమోదైన కేసుతో ఇబ్బందుల్లో పడ్డారా?

గిరిజనుడిపై దాడి చేయడంతో విజయ్‌పై కేసు!

డిసెంబర్‌తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీకాలం!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై ఖమ్మం టీఆర్‌ఎస్‌ నేతల కన్ను!

 

బ్యూరో రిపోర్ట్ ఖమ్మం , పెన్ పవర్

 

ఆ ప్రజాప్రతినిధికి సన్‌ స్ట్రోక్‌ తగిలింది. పదవీకాలం గడువు సమీపిస్తున్న సమయంలో ఎదురైన హఠాత్‌ పరిణామం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెగ టెన్షన్‌ పడుతున్నారట. ఖమ్మం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిన ఆ నాయకుడు ఎవరో.. ఏంటో  ఓ లుక్కేయండి...

 

 బాలసాని లక్ష్మీనారాయణ. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన బాలసాని గత మూడు దశాబ్దాలుగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న ఆయన ఇప్పుడు ఊహించని ఇబ్బందుల్లో పడ్డారు. కుమారుడి రూపంలో వచ్చిన కష్టం తలచుకుని తెగు దిగులు చెందుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్సీ పదవీ కాలం గడువు దగ్గర పడుతుండటంతో.. మళ్లీ పొడిగింపు కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలకు ఎక్కడ గండి పడుతుందోనని ఆందోళనలో ఉన్నారట బాలసాని.  బాలసాని రాజకీయ నేతే కాదు.. కాంట్రాక్టర్‌ కూడా. భద్రాచలం ఏరియాలోని ఇసుక ర్యాంపుల్లో ఆయన చెప్పిందే వేదమని టాక్‌. ఈ వ్యవహారాలన్నీ బాలసాని కుమారుడు విజయ్‌ పర్యవేక్షణలో ఉంటాయని చెబుతారు. అదే ఇప్పుడు వివాదంగా మారిందట. కూసుమంచి మండలంలోని కొక్యాతండాలో రోడ్డుపనుల్లో ఉన్న ఒక గిరిజనుడిపై విజయ్‌ దాడి చేయడం దుమారం రేపింది. సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు ఆందోళనలు చేపట్టడంతో విజయ్‌పై కేసు పెట్టక తప్పలేదు. అదీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో మరింత రచ్చ అయింది. తండ్రి అధికార పార్టీ ప్రజాప్రతినిధి.. మంత్రి పువ్వాడ అజయ్‌ ఆశీసులు ఉన్నా.. కుమారుడిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో బాలసానికి దిక్కుతోచడం లేదట. కేసు కాకుండా  ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని సమాచారం. ఇప్పుడీ కేసే తన రాజకీయ భవిష్యత్‌కు ఎక్కడ ఎసరొస్తుందోనని ఆందోళన చెందుతున్నారట.  బాలసాని గతంలో టీడీపీలో ఉండేవారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గంలో ఉండటంతో డీసీ ఎమ్ ఎస్ , డీ సీ సీ బీ  ఛైర్మన్‌ పదవులు వరించాయి. చివరకు టీడీపీలోనే ఎమ్మెల్సీ అయ్యారు. తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో ఆయన్ని అనుసరించారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన ఆశీసులతో మరోసారి ఆ పదవి చేపట్టారు. 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోవడంతో.. మంత్రి పువ్వాడ అజయ్‌ శిబిరంలో చేరారు బాలసాని. ఈ ఏడాది డిసెంబర్‌తో తన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిపోతుంది. ఆ పదవిని మరోసారి పొడిగించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇలాంటి సమయంలో సన్‌ స్ట్రోక్‌ తగలడంతో బాలసానికి మైండ్‌ బ్లాంక్‌ అయిందట.  మూడు దశాబ్దాలుగా ఖమ్మం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు బాలసాని. అనేక మంది పోలీసులకు పోస్టింగ్‌లు ఇప్పించారు. ఈ సమయంలో అవేమీ అక్కరకు రాలేదని కుమారుడు విజయ్‌పై నమోదైన కేసును తలచుకుని ఆయన కుమిలిపోతున్నారట. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై ఖమ్మం టీఆర్‌ఎస్‌లో చాలా మంది కన్ను పడింది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. బాలసాని అలాంటి అడ్డంకులను అధిగమించే పనిలో ఉండగా.. ఎదురైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు మనశ్శాంతిని దూరం చేసిందట. అధికార పార్టీలోనూ దీనిపైనే చర్చ జరుగుతోంది. మరి.. ఈ గండాన్ని బాలసాని ఎలా అధిగమిస్తారో చూడాలి.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...