సర్కారీ దవాఖానాలో బెడ్లు లేవు.. ప్రయివేటుకు సొమ్ము లేదు.. కరోనా పేషెంట్ల ఇక్కట్లు!
ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత.. ప్రభుత్వాస్పత్రిలో వసతుల లేమి.. కరోనా రోగుల పాలిట శాపంగా మారాయి. లక్షణాలు లేని కరోనా వ్యాధిగ్రస్తులను హోం క్వారంటైన్‌కు పంపిస్తుండగా.. లక్షణాలున్న పేషెంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సర్కారీ ఆస్పత్రుల్లో ఆశించిన మేర చికిత్స దొరకని వారంతా ప్రైవేటు బాట పడుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా చికిత్సలకు అనుమతులున్న 18 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవు. దీంతో రోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పై స్థాయిలో ఉన్న వ్యక్తుల రికమండేషన్ ఉంటేనే బెడ్లు దొరికే అవకాశం ఉండటంతో.. సాధారణ పేషెంట్ల పరిస్థితి నరకంలా మారింది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో బెడ్‌కు 8 మంది వెయిటింగ్ లిస్ట్ ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ బెడ్ దొరికినా.. పీపీఈ కిట్స్ అని, మెడిసిన్ అని.. లేదా వెంటిలెటర్ అంటూ లక్షల్లో చార్జీలు దండుకుంటున్నాయి.. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 11 ప్రభుత్వ ల్యాబ్‌లలో టెస్టులు చేస్తున్నప్పటికీ.. సామాన్యుడుకి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం కొవిడ్ పరీక్ష చేయాలంటే.. ఒక రోజు వచ్చి టోకెన్ తీసుకోవాలి. ఆ తర్వాత పరీక్ష కోసం ఏకంగా రెండు రోజుల పాటు లైన్‌లో నిలబడాల్సిన దుస్తితి ఉంది. కేవలం పరీక్షలకే మూడు రోజులు సమయం పట్టగా.. రిపోర్ట్ రావడానికి ఏకంగా 6 రోజులు పడుంతోంది. దీంతో లక్షణాలు ఉన్నవారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చికిత్స తీసుకుందామనకుంటే రిపోర్ట్ లేకపోవడంతో ఎక్కడా చేర్చుకోవడం లేదు. ప్రతీ పరీక్షా కేంద్రంలో రోజూ 250 వరకు పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్నా.. రికమెండేషన్‌లతోనే సగం పరీక్షలు పూర్తవుతున్నాయని.. రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోన పాజిటివ్ కేసుల్లో.. 80 శాతం లక్షణాలు లేని కేసులు మాత్రమే వస్తుండడంతో.. ప్రభుత్వ క్వారంటైన్ గా ముందు నుంచీ ఉన్న నేచర్ క్యూర్ హస్పిటల్ లో.. వందలాది మంది రోగులు కోలుకొని ఇంటికి వెళ్తున్నారు. 300 బెడ్స్ సౌకర్యం ఉన్న ఈ ఆస్పత్రి.. యాక్టీవ్ కేసులతో పాటు.. డిశ్చార్జీలతో నిత్యం రద్దీగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment