మాకు న్యాయం చేయండి
- నాలుగు సంవత్సరాలుగా వెలిలో ఉన్నాం
- సొసైటీ ఆదాయం తమకు చెందకుండా కుల పెద్దలు అడ్జుకున్నారంటూ ఆరోపణ
- లక్ష్మీపోలవరంలో దళితుల నిరసన
రావులపాలెం, పెన్ పవర్
తమను వెలి వేసి సంఘ కార్యక్రమాలలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న కుల పెద్దలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ శనివారం రాత్రి లక్ష్మీపోలవరం గ్రామంలో కొన్ని కుటుంబాల దళితులు నిరసన చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు సంవత్సరాల క్రితం లూధరన్ దేవాలయంకు చెందిన స్ధలం మీదుగా గ్రామంలోని సంజీవయ్య మాల పేద కూలీ సంఘ పెద్దలు రోడ్డు వేయడానికి నిర్ణయించారు. అయితే ఈ సంఘ స్ధలం మీదుగా రోడ్డు వేయడాన్ని సంజీవయ్య పేద కూలీ సంఘంకు చెందిన 32 కుటుంబాల వారు వ్యతిరేకించారు. అయినప్పటికీ సంఘ అధ్యక్షుడు బండి సత్యనారాయణ ఆధ్వర్యంలో చర్చి స్ధలంలో ఉన్న ప్రహారీ గోడను కూల్చివేసారు. దీంతో గ్రామంలో శాంతి భద్రత సమస్యలు తలెత్తడంతో 2016 సెప్టెంబర్ 17వ తేదీన రావులపాలెం తహసీల్దారు కార్యాలయంలో అప్పటి తహసీల్దారు, సిఐ, మండల అధికారుల ఆధ్వర్యంలో ఇరువర్గాలతో శాంతి కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. రోడ్డు వేయడానికి ఇరువర్గాలు అంగీకరించడంతో సమస్య పరిష్కారం అయ్యింది. సమస్య పరిష్కారం అయినప్పటికీ అప్పటి నుండి 32 కుటుంబాలకు చెందిన తమకు సంఘ ఆదాయం చెందకుండా అడ్డుకోవడంతో పాటు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేసి కుల పెద్దలు తమను మానసిక వేదనకు గురుచేస్తున్నారంటూ ది 2020 మార్చి 6వ తేదీన తహసీల్దారు జిలానీ, ఎస్సై బుజ్జిబాబులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఇరు పక్షాల సమక్షంలో తహసీల్దారు, ఎస్సైలు విచారణ చేపట్టగా వీరిని సంఘం నుండి వెలివేయలేదని , సంఘ కార్యక్రమాలకు పిలుస్తామని అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పడంతో అధికారులు వెళ్ళిపోయారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం సంఘ పెద్దలు రామాలయం వద్డ సంఘానికి చెందిన సుమారు 15 ఎకరాల భూమి, కొబ్బరి చెట్లు లీజుకు ఇచ్చేందుకు పాటలు పెట్టగా పాడేందుకు వెళ్లిన తమను మీరు సంఘంలో లేరు, మీకు పాడేందుకు అవకాశం ఇచ్చేది లేదు అంటూ తిరస్కరించారు. దీంతో శనివారం తహసీల్దారు జిలానీ, రావులపాలెం పోలీసులకు ఈ విషయం పై ఫిర్యాదు చేశామని, విచారించేందుకు వచ్చిన అధికారులు కనీసం తమతో మాట్లాడకుండా వెళ్ళిపోయారని వాపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆందోళన చేపట్టామని, సమస్యను పరిష్కరించడానికి వచ్చిన అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడి మేరకే వెనుదిరికి వెళ్ళిపోయారని ఆరోపించారు. పై అధికారులు కలుగజేసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment