లాల్ సలామ్
నేటి నుంచే మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు
మన్యాన్ని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు
చింతపల్లి, పెన్ పవర్
జజ్జనకరి జనారే డప్పుల దరువులు... ఉత్తేజపరిచే ఎర్రదండు విప్లవ గీతాలు... తుపాకీ నీడన అమర వీరులకు అర్పించే జోహార్లు... చైతన్యం నింపే ప్రసంగాలు... ఇవీ ఎరుపెక్కిన మన్యంలో వారం రోజులపాటు మావోయిస్టులు నిర్వహించే వారోత్సవాల విషయాలు...
ప్రతీ ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీలో పని చేసి అసువులు బాసిన వారి పేరుతో నాటి సి పి ఐ (ఎంఎల్) నేటి మావోయిజం, నక్సల్బరీ పితామహుడు చారు మజుందార్ మృతి చెందిన తేదీని స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తారు. నక్సల్బరీ చావలేదు... దానికి చావు లేదంటూ నాటి నక్సల్స్ నుంచి నేడు పేరు మార్చుకున్న మావోయిస్టుల వరకు అదే నినాదంతో పోరాటాలు చేస్తూ వస్తున్నారు. పోలీస్ వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ స్థూపాలు నిర్మించి ఎర్ర జెండాల రెపరెపల మధ్య 1972 జూలై 28 నుంచి నేటి వరకు ఆ వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తూ వస్తున్నారు. మావోయిజానికి చావు లేదనే నినాదాన్ని పాటిస్తూ ఈ సమయంలోనే కొత్తవారిని దళంలో చేర్చుకొని శిక్షణ ఇస్తారు. ఈ సమయంలోనే యాక్షన్ టీంలు రంగ ప్రవేశం చేస్తాయి. పోలీసులను పక్కదోవ పట్టించి మరీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు.గాలింపు చర్యలు జరుగుతున్న ప్రాంతాల్లోనే మృతిచెందిన మావోయిస్టులకు స్థూపాలు (తాత్కాలికంగా) నిర్మిస్తారు. మారుమూల గ్రామాల్లో యువతను చైతన్య పరచి సమావేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. వారోత్సవాలు మరింత ఉత్సాహంగా సాగడానికి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఏవోబీ లోని దళ సభ్యులు కూడా పాల్గొంటారు.ఈ దఫా ఏవోబీ, విశాఖ ఏజెన్సీలోని వారోత్సవాలకు కేంద్ర కమిటీ మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ రామకృష్ణ( ఆర్ కె), ఏవోబీ కార్యదర్శి చలపతి, అరుణ, ఉదయ్, జగన్ వంటి నాయకులు హాజరై ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 22 న, జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్ కె తప్పించుకోగా చలపతి, అరుణ గాయపడినట్లు తెలిసింది. వారు విడిచి వెళ్ళిన రైఫైల్,కిట్ బ్యాగులు పోలీసులు గుర్తించి, స్వాధీనపరుచుకున్నారు.25న, జరిగిన ఎదురు కాల్పుల్లో ముఖ్య మావోయిస్టు నాయకులు తప్పించుకోగా ఒక మావోయిస్టు మృతి చెందాడు.మావోయిస్టులు జరిపే ఈ వారోత్సవాల వలన వారం రోజుల పాటు గిరిజన ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఏజెన్సీ ప్రాంతంలోని పలువురు రాజకీయ నాయకులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు.లాల్ సలాం అంటూ సిపిఐ మావోయిస్టు జరిపే కార్యక్రమాలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వారం, పది రోజుల పాటు భయానక వాతావరణంలో గడపవలసిందేనని ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment