ఎమ్మెల్యే చిర్ల గన్ మేన్ కి కరోనా
నిర్ధారించిన స్ధానిక వైద్యాధికారులు
అత్యుత్సాహమే కొంప ముంచిందా
ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలే కరోనా వ్యాప్తికి కారణమా?
సర్వత్రా చర్చ
రావులపాలెం, పెన్ పవర్
కొత్తపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తుంది.ఇటీవల ఆత్రేయపురం తహసిల్దార్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ కాగా,తాజాగా మంగళవారం సాక్షాత్తు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గన్ మెన్ కు పాజిటివ్ గా నిర్ధారణ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు దఫాలు లాక్ డౌన్ అమలు చేసి తదుపరి సడలింపులతో కొనసాగిస్తున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టమైన సూచనలు ప్రభుత్వాలు చేసాయి. అయితే ప్రజాప్రతినిధులే అధికారులతో సమీక్షలు ,సమావేశాలు నిర్వహించడం కొత్తపేట నియోజకవర్గంలో కరోనా వ్యాప్తికి కారణం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్తపేట, ఆలమూరు ఏఎంసి పాలక వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాలను అధికార వై ఎస్ ఆర్ సి పి నిర్వహించడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా వైరస్ ప్రభలుతున్న ప్రస్తుత సమయంలో ఏఎంసీ పాలకవర్గాల ప్రమాణస్వీకార కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడం అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొద్ది రోజుల క్రితం ఆలమూరు ఏఎంసి పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కార్యకర్తలతో వై ఎస్ ఆర్ సి పి ఆర్భాటంగా నిర్వహించింది. ఆలమూరు మండలంలో అప్పటికే పినపల్ల గ్రామంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడగా, ఈ కార్యక్రమాన్ని ఆ గ్రామానికి సమీపంలో నిర్వహించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా తాజాగా ఎమ్మెల్యే గన్ మెన్ కు పాజిటివ్ రావడంతో ఇదంతా అప్పట్లో పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమాల వల్లనే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలాగే కొత్తపేట మండలంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. కరోనా విస్తృతంగా ప్రబలుతున్న ప్రస్తుత సమయంలో ఇకనైనా నిర్లక్ష్యం వీడి నిబంధనలను నాయకులు అధికారులు ప్రజలు అన్న తేడా లేకుండా పాటించేలా చర్యలు చేపడితేనే కరోనాకు అడ్డుకట్ట వేయగలమని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment