ఆదివాసీలను ఆదుకోని అడ్డాకులు
అడ్డాకులు సేకరణలో ఆదివాసీ లకు అవస్థ లే.
వారపు సంతలో దళారుల దోపిడి.
చింతపల్లి, పెన్ పవర్
మన్యంలోని అటవీ ఉత్పత్తుల పేరు చెప్పగానే చటుక్కున గుర్తుకు వచ్చేది అడ్డాకులు. వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నా ఏడాది పొడవునా అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన అడ్డాకుల సేకరణ ప్రధానంగా చేసుకుని కొన్నివేల గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. విశాఖ మన్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పుష్కలంగా లభించే అడ్డాకులను ఆధారంగా చేసుకుని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కొన్ని వేల గిరిజన కుటుంబాలు ఆధారపడుతున్నాయి. మన్యంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్నా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అనేక అవకాశాలు న్నప్పటికీ ఇటు గిరిజన సహకార సంస్థ గాని అటు ఐటిడిఎ గాని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గిరిజనులకు సహకరించాల్సిన గిరిజన సహకార సంస్థ పేరుకే! ఆచరణలో మాత్రం గిరిజనులకు "కారం" రుచి చూపిస్తుంది. మద్దతు ధర ప్రకటించి (ఇచ్చి) అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన గిరిజన సహకార సంస్థ అధికారులు మౌనం దాల్చడంతో దళారులు ఆదివాసీలను నిలువునా ముంచుతున్నారు. గిరిజనులు సేకరించే అడ్డాకులతో పాటు అన్ని అటవీ ఉత్పత్తులను జి సి సి కొనుగోలు చేయాలి. కానీ, అడ్డాకులను నిల్వ చేసేందుకు తమ వద్ద తగినన్ని గోదాములు లేవనే కారణాన్ని సాకుగా చూపించి ఆ శాఖ వీటిని కొనుగోలు చేయడం లేదు.పోనీ అడ్డాకులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తుందా? అంటే అదీ లేదు. తాము కొనుగోలు చేయని అడ్డాకులకు గిట్టుబాటు ధరలు ప్రకటించడంపై జి సి సి వెనకాడుతోంది.ఏటా మార్చి నుంచి తొలకరి జల్లులు కురిసే వరకు మన్యంలో వ్యవసాయ పనులేమి ఉండవు. ఈ సమయంలో గిరిజనులు కొద్దిమేర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీంతో వారు అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారు. అడవుల్లోకి వెళ్లి అడ్డాకులు సేకరించి వాటిని వారపు సంతలకు తీసుకువచ్చి విక్రయిస్తారు. అడ్డాకులను విక్రయించగా వచ్చిన సొమ్ముతో అవసరాలు తీర్చుకోవడంతోపాటు అడవుల నుంచి ఎంతో శ్రమించి వారం రోజులపాటు సేకరించిన అడ్డాకులను వ్యయ, ప్రయాసలతో వారపు సంతలకు తీసుకు వస్తే తగిన గిట్టుబాటు ధర లభించక పోవడంతో వారు నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.సుమారు రూ.1వేయి నుంచి రూ.12 వందలకు ధర పలికే కావిడ అడ్డాకులను వారపు సంతల్లో దళారులు కేవలం రూ.6 వందలకు కొనుగోలు చేసి గిరిజనులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. మైదాన ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులు మన్యంలోని అన్ని వారపు సంతల్లో భారీగా అడ్డాకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి లక్షల్లో లాభాలు పొందుతున్నారు. అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ మాత్రమే కొనుగోలు చేయాల్సిన గుత్తాధిపత్యాలు గిరిజన సహకార సంస్థ కే ఉన్నాయి.
No comments:
Post a Comment