Followers

నాగు పాము కలకలం


  నాగు పాము కలకలం


 


చింతపల్లి  , పెన్ పవర్


 


నిశ్శబ్ద, నిషేధిత ప్రాంతాల్లో నివసించవలసిన విష పురుగులు జనావాసాల్లో జీవనం సాగిస్తున్నాయి. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నాగు పాము కలకలం సృష్టించింది. ప్రస్తుత మండల రెవెన్యూ కార్యాలయ భవనం ప్రధాన రహదారికి ఎదిరించి నిర్మించడంతో ఆ రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో కొత్త రెవెన్యూ భవన నిర్మాణ పనులు చేపట్టారు. కొత్త భవన నిర్మాణానికి పునాదులు వేసి పిల్లర్స్ నిర్మాణానికి కావలసిన ఇనుప ఊసల సామాగ్రిని ఉపయోగించారు. ఇంతలో ఏమైందో! ఏమో!  పిల్లర్స్ కు ఉపయోగించిన పునాదులకు సిమెంటుతో కాంక్రీట్ వేయకుండా  నిర్లక్ష్యంగా చాన్నాళ్ల నుంచి నిలిపివేశారు. దీంతో పునాదుల చుట్టూ తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో పిచ్చిమొక్కలు విపరీతంగా వెలిశాయి. నిర్జీవ ప్రదేశంలోనూ, దట్టమైన పొదల మధ్య జీవనం సాగించాల్సిన విషపురుగులు రెవెన్యూ కార్యాలయాన్ని నివాసయోగ్యంగా చేసుకున్నాయి. నిత్యం తహసిల్దార్ కార్యాలయంలో పనుల నిమిత్తం  వచ్చే గిరిజనులు వారి పని పూర్తి చేసుకునేంతవరకు ఆ పునాదుల పైనే నిరీక్షిస్తూ ఉండేవారు. అయితే మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులు పడడం, ఆ వెంటనే విపరీతమైన ఎండ కాస్తుండటంతో విపరీతమైన ఉక్కపోత మొదలైంది. దీంతో పునాది రంధ్రాల్లో విశ్రాంతి తీసుకుంటున్న నాగుపాము ఉక్కపోతను తాళలేక జనాల మధ్యకు అకస్మాత్తుగా వచ్చింది. అది చూసిన జనాలు గోల చేయడంతో ఏం చేయాలో తెలియక విషనాగు పిల్లర్స్ కు ఉపయోగించిన ఇనుప ఊసలపైకి ఎగబాకింది. అక్కడ నుంచి ఎటూ వెళ్లడానికి దారి లేక తిరిగి కిందకి వచ్చి పొదలమాటున మాయమైంది. దీంతో కార్యాలయానికి వచ్చిన జనాలు అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.ఇంకా పునాది రంద్రాల్లో ఏమైనా విష పురుగులు ఉన్నాయేమోనని కార్యాలయానికి వచ్చే వారితో పాటు సిబ్బంది భయాందోళనచెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి నూతన రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యేంతవరకు కార్యాలయం చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని మండల వాసులు కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...