ఆలమూరులో వ్యాపార సమయాలు కుదిస్తూ అధికారులు, వ్యాపారస్తులు నిర్ణయం
పెన్ పవర్, ఆలమూరు
-ఉదయం ఆరు గంటలు నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వ్యాపారాలు నిర్వహణ.
--తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పూర్తిగా మార్కెట్ బంద్.
--సంత రోజుల్లో మాంసాహారం బంద్.
ప్రశాంతతకు నిలయమైన మండల కేంద్రమైన ఆలమూరులో గత వారం రోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపధ్యంలో ఆలమూరు ఎంపిడిఓ జేఏ జాన్సీ, ఎస్సై ఎస్ శివప్రసాద్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, తహశీల్దార్ జవ్వాది వెంకటేశ్వరి ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వివిధ రకాల వ్యాపారులు, వారి సంఘ సభ్యులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు వ్యాపారసంఘాల వారు కలిసి ఏకాభిప్రాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆలమూరు గ్రామంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రస్తుతం ఉన్న వ్యాపార సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 11వ తేదీ (శనివారం) నుండి తదుపరి ఉత్తర్వులు నిర్ణయించే వరకు ప్రతీ రోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వ్యాపారాలు నిర్వహించాలని వ్యాపార సంఘాల వారు అందరూ సంయుక్తంగా నిర్ణయించుకుని అధికారులకు వెల్లడించారు.మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తరువాత పూర్తిగా వ్యాపారాలు మూసి వేయాలని అధికారులు కోరారు. సంత నిర్వహించే రోజున మాంసాహారం, చేపలు, సంత పూర్తిగా మూసివేయాలని ఎంపిడిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కే సంజీవ్ రెడ్డి తో పాటు వివిధ వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment