మన్యంలో అప్రమత్తం రంగంలోకి ప్రత్యేక బలగాలు
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు (ఏఓబి) ప్రాంతంలో అలజడి వాతావరణం
అడవులను జల్లెడ పడుతున్న కూంబింగ్ దళాలు
చింతపల్లి , పెన్ పవర్
చిటపట చినుకులు పడుతున్న సమయంలోనే మళ్లీ తుపాకులు గర్జించడానికి తహతహలాడు తున్నాయి... నివురుగప్పె చలికి వేడి పుట్టించేందుకు అర్రులు చాస్తున్నాయి... ఏజెన్సీతో పాటు ఏ ఓ బి లోని మావోల శేషాన్ని పూర్తిగా ఏరివేయడానికి అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు మళ్లీ అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ నెలలోనే ఒడిస్సాలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఏ ఓ బి లో ఉదృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. జీవనది లాంటి మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్నా! ఎక్కడో ఒకచోట మేమున్నామనే సంకేతాలు పంపుతూ మావోలు బయటకు వస్తూనే ఉన్నారు. ఒడిస్సాలో ఎదురుకాల్పులు సంఘటన జరిగి 15 రోజులు గడవకముందే ఇటీవల పాడేరు డివిజన్, పెదబయలు మండలం, గిన్నెలకోట పంచాయతీ,లండులు మెట్టగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇరువర్గాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ! ఈ సంఘటనలో మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.అయితే సంఘటనా స్థలంలో తుపాకులు, కిట్ బ్యాగులు లభ్యమవ్వడమే ఇందుకు కారణం. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరు వర్గాలు మళ్ళీ అడవి సమరంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. అడవులను అణువణువునా గాలించడానికి వందలాది మంది ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపు తున్నారు.మరో వారంరోజులలో సిపిఐ మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి.దానిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలు మావోయిస్టులు ప్రతిష్టాత్మకంగా ప్రతియేటా నిర్వహిస్తుంటారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు (ఏ ఓ బి) లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గత పది రోజులుగా యుద్ధవాతావరణం నెలకొంది. ఏ ఓ బి లో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఏవోబీ అటవీ ప్రాంతంలో గతంలో మావోయిస్టులు నిర్మించిన మావోయిస్టు అమరవీరుల స్థూపాలకు వారోత్సవాల నేపథ్యంలో ఎరుపు రంగులు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను ఎలాగైనా అడ్డుకోవాలని ఇటు పోలీసులు... తీవ్రమైన నిర్బంధం మధ్య మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించి ఏ వో బి లో తమ పట్టును కోల్పోలేదని నిరూపించుకోవాలని అటు మావోయిస్టులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ తమ కార్యకలాపాలను చాపకింద నీరులా కొనసాగిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుం దోనన్న భయాందోళన మన్యం వాసుల్లో నెలకొంది.
No comments:
Post a Comment