Followers

 శిలాఫలకం వేశారు రహదారి మరిచారు



 శిలాఫలకం వేశారు రహదారి మరిచారు

చింతపల్లి  , పెన్ పవర్

మండలంలోని అంజలి శనివారం రహదారి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా బురద పొలాన్ని తలపిస్తుంది. దీంతో స్థానిక గిరిజనులు ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం రూ.3 కోట్లతో తాజంగి గ్రామం నుంచి జాజుల పాలెం గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించింది. జాజుల పాలెం గ్రామం నుంచి అంజలి శనివారం గ్రామం వరకు రహదారి నిర్మించేందుకు రూ.2.75 కోట్ల నిధులు విడుదల కావడంతో నాటి శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి 2018 లో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. శిలాఫలకం ప్రారంభించిన అధికారులు రహదారి నిర్మాణాన్ని విస్మరించారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అంజలి శనివారానికి "శనిగ్రహం" పట్టింది. దీంతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలంతో పాటు మైదాన ప్రాంతంలోని కొత్తకోట, రావికమతం గ్రామాల వరకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. చింతపల్లి మండలంతో పాటు జి.మాడుగుల మండలానికి చెందిన సుమారు 40 గ్రామాల గిరిజనులు ఈ రహదారి పైనే ఆధారపడి, రాకపోకలు సాగిస్తూ, జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంత గర్భిణీ స్త్రీలు ఏ క్షణంలో ఎలా ఉంటుందోనని ప్రసూతికి ముందుగా పుట్టింటికి వెళ్ళినట్టు మూడు నెలల వైద్య సహాయం అందే చోట మకాం వేస్తున్నారు.ప్రసూతి తరువాత మూడు నెలలకు స్వగ్రామం తిరిగి చేరుకుంటున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా నేటి వరకు అంజలి శనివారం రహదారి నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ఈ రహదారి వర్షాలకు అధ్వాన్నంగా తయారై నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. రహదారి పై ఆధారపడిన గిరిజనులకు ఆటోలో ప్రయాణం తప్ప వేరే మార్గం లేదు. అటువంటిది నేడు ఆటో కాదు కదా! ద్విచక్ర వాహనం ఆఖరికి సైకులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర వైద్య సేవలకు కనీసం ఫీడర్ (బైక్) అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులకు మా పాట్లు, ఫీట్లు పట్టవా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంజలి శనివారం గ్రామ రహదారి నిర్మించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...