నిర్మల సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్బంగా రాష్ట్రానికి రావలసిన పెండింగ్ నిధులు సహా పలు కీలక విషయాలపై చర్చించారు. పెండింగ్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చెయ్యాలని నిర్మలా సీతారామన్ ను కోరినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితోను మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. అలాగే పెండింగ్ నిధుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ అధికారులను బుగ్గన రాజేంద్రనాథ్ కలవనున్నట్టు సమాచారం. బుగ్గన వెంట ఏపీ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ్ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్బంగా పీడీఎస్, జీఎస్టీ పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, అలాగే పెండింగ్ బకాయిల విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి చేయూతగా అదనంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణలు కేంద్రానికి ఇచ్చినట్టు తెలిపారు. 3,500 కోట్ల రూపాయల రీయంబర్స్‌మెంట్ చేయాల్సి ఉందని. పోలవరానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయంబర్స్‌మెంట్ చెయ్యాలని కోరినట్టు తెలిపారు. కోవిడ్ కారణంగా నిధుల విడుదలలో కొంత ఆలస్యం ఉందని అన్నారు.. కేంద్రం నుంచి జీఎస్టీ బకాయిలు 3500 కోట్లు రావాల్సి ఉందని బుగ్గన తెలిపారు.
No comments:
Post a Comment