Followers

గుడ్‌ న్యూస్‌: కరోనా చికిత్సకు మరో ఔషధం


గుడ్‌ న్యూస్‌: కరోనా చికిత్సకు మరో ఔషధం


అనుమతించిన డీసీజీఐ


దిల్లీ:


 కరోనా చికిత్సలో వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) మరో ఔషధానికి అనుమతులిచ్చింది. చర్మ వ్యాధి అయిన సొరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే ‘ఇటోలీజుమ్యాజ్‌’ ఇంజెక్షన్‌ను ‘పరిమితం చేసిన అత్యవసర వినియోగం’ కింద వాడేందుకు అంగీకరించింది. మోతాదు నుంచి తీవ్ర స్థాయి లక్షణాలతో బాధపడుతున్న కొవిడ్‌ రోగులకు దీన్ని ఇవ్వొచ్చని తెలిపింది. 


కరోనా చికిత్సలో ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఇటోలీజుమ్యాజ్‌కు డీసీజీఐ డాక్టర్‌ వి.జి.సొమానీ అనుమతిలిచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత్‌కు చెందిన బయోకాన్‌ సంస్థ దీన్ని తయారు చేస్తోంది. కొవిడ్‌పై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకంగా పనిచేసే సైటోకిన్ల విడుదలలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రోగులపై చేసిన ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చిన తర్వాతే దీనికి అనుమతులిచ్చినట్లు డీసీజీఐ అధికారులు తెలిపారు. ఎయిమ్స్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు ఈ ప్రయోగాల్ని పర్యవేక్షించినట్లు వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా దీన్ని సోరియాసిస్‌ చికిత్సలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అయితే, దీన్ని తీసుకోవడానికి బాధితులు రాతపూర్వకంగా అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారిలో ‘ఇటోలీజుమ్యాబ్‌’ ప్రభావవంతంగా పనిచేస్తోందని ముంబయిలోని నాయిర్‌ ఆస్పత్రి మే నెలలోనే ప్రకటించింది. ఇద్దరు రోగులకు దీన్ని అందించగా వెంటిలేటర్‌ దశ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించింది. బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లోని ఆస్పత్రుల్లో ప్రయోగ పూర్వకంగా వాడేందుకు ‘ఇటోలిజుమ్యాబ్‌’ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అప్పట్లో ప్రకటించారు. ముందు రోగుల కాలేయం, కిడ్నీల పనితీరును పరీక్షించిన తర్వాతే ఈ మందు ఇస్తారు. కొందరు రోగులకు ఒకడోసు సరిపోతుండగా.. మరికొందరికి మూడు డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని అప్పట్లో నాయిర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌, ఫవిపిరవిర్‌ వంటి ఔషధాలు ప్రభావవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. వీటిని పలు కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అలాగే కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల పర్యవేక్షణలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సైతం వాడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించిన విషయం తెలిసిందే


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...