నిరుద్యోగ యువతకు చుక్కులు చూపిస్తున్న ఉపాధి కల్పనాధికారి
మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శివాజీ ఆరోపణ
కరోనా సాకుతో ఆఫీసుకు ఢుమ్మా
ఒకరిద్దరొచ్చినా స్మార్ట్ ఫోన్ గేమ్‌తో బిజీ
(పెన్‌పవర్ స్టాఫ్ రిపోర్టర్, ఒంగోలు)
జిల్లా కేంద్రమైన ఒంగోలు ఎంప్లాయ్‌మెంటు కార్యాలయంలో నిరుద్యోగులుగా నమోదు చేసుకునే పక్రీయను అధికారులు నిలిపి వేశారని మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జి శివాజి ఆరోపించారు. జిల్లా మారుమూల నుండి ప్రతిరోజు ఎంతోమంది నిరుద్యోగ యువత, విద్యార్దులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు నమోదు కొరకు ఎంప్లాయ్‌మెంటు కార్యాలయంకు వచ్చి ఉసూరు మంటూ తిరిగి వెళుతున్నారు. ఇదేమిటని అక్కడి విధుల్లో ఉన్న సిబ్బందిని అడిగితే కోవిడ్-19 కరోనా బారినపడకుండ అంటూ వింత సమాధానం చెబుతూ విద్యార్థులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని శివాజి విమర్శించారు. స్మార్టు ఫోన్ల పై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేకపోవడం పట్ల ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను ఎంప్లాయ్‌మెంటు కార్యాలయం సౌజన్యంతో పోస్టులను ఎ.పి.సి.ఓ.యస్. ద్వారా భర్తీ చేయనుందన్నారు. దీని కోసమై నిరుద్యోగులు విద్యార్హత నమోదు కోసం రోజులు తరబడి కార్యాలయం చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగుల లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ, విధులకు హాజరై ప్రజలకు సేవలు అందిస్తుంటే కేవలం ఎంప్లాయ్‌మెంటు కార్యాలయ ఉద్యోగులు మాత్రం ఇలా ప్రవర్తించడం ఏమిటని శివాజి ప్రశ్నించారు. రోజుకు కొద్దిమంది చొప్పున భౌతిక దూరం పాటిస్తూ, కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ నిరుద్యోగ విద్యార్థులకు నమోదు అవకాశం కల్పించాని వారు కోరారు.
No comments:
Post a Comment