కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్
అల్లవరం ,పెన్ పవర్
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోమ్ ఐసో లేషన్ లో వుంచడం వలన తమకు వైరస్ సోకుతుందనే భయం ప్రజల్లో వుందని, హోమ్ ఐసోలేషన్ వలన ఎవరూ భయపడనవసరం లేదని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. గురువారం అల్లవరం మండలం బోడసకుర్రు లోని టిడ్ కో భవన సముదాయంలో అమలాపురం డివిజన్ లోని కరోనా పాజిటివ్ రోగుల కొరకు సుమారు రెండు వేల పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మూడు వేలమంది కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ లో వుంచడం జరిగిందని ఏ సమస్యలు లేకుండా అందరూ బావున్నారని, వీరిని ఇంటిలో ప్రత్యేక గదిలో ఉంచి వైద్య చికిత్స అందించడం వలన కుటుంబ సభ్యులకు కూడా ఏ విధమైన సమస్యలు రాలేదని కలెక్టర్ తెలిపారు.జిల్లా లో కరోనా వలన సంభవించిన మరణాలను పరిశీలిస్తే చాలా వరకు బిపి,షుగర్,తో బాటు తీవ్రమైన ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారే మరణించినట్లు గా గుర్తించడం జరిగిందని అన్నారు.కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి కొద్దిపాటి లక్షణాలు వున్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్ లో వుంచి చికిత్స అందించడం జరుగుతుందని, తీవ్రమైన కరోనా లక్షణాలతో సీరియస్ గా వున్న రోగులను తక్షణమే అన్ని సౌకర్యాలు వున్న కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని కలెక్టర్ తెలియచేశారు. బోడసకుర్రు లోని సిసిసి సెంటర్, మరియు రాజమండ్రి లోని బోమ్మూరు సిసిసి సెంటర్ 5 వేల మంది పాజిటివ్ రోగులను వుంచే సామర్ధ్యం కలిగి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో కరోనా తీవ్రత ఎక్కువగా వున్న కారణంగా సిసిసి సెంటర్ లను పెంచుకోవాల్సిన అవసరం వుందని కలెక్టర్ తెలిపారు. కరోనా రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులను, ఏ.ఎన్.ఎం లు తదితర వైద్య సిబ్బందిని డ్యూటీ అనంతరం ఇళ్లకు వెళుతుంటే చుట్టు పక్కల వారు వారినుండి కరోనా సోకుతుందని అడ్డుకుంటున్నారని ఇటువంటి అపోహలు ప్రజలు విడనాడాలని, ఈ విధంగా ఎవరైనా అడ్డుకుంటే వారి పై ఖటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.ముందుగా కలెక్టర్ సిసిసి సెంటర్ లోని అన్ని విభాగాలను పరిశీలించి ఇంకనూ తీసుకోవలసిన చర్యలు పై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ వెంట అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, అమలాపురం డి ఎస్ పి షేక్ మాసూం భాషా,ఏ.డి.ఎం.అండ్ హెచ్. ఓ డా.పుష్కరరావు, మునిసిపల్ కమీషనర్ కె వి వి ఆర్ రాజు, డిఇఇ అప్పలరాజు, అల్లవరం మండల తహశీల్దార్ అప్పారావు, ఎం.పి.డి. ఓ సుగుణ శ్రీ కుమారి, గోడిలంక వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment