మరో కరోనా కేసు
చింతపల్లి , పెన్ పవర్
చింతపల్లి ఏజెన్సీలో సోమవారం మరో కరోనా కేసు నమోదయింది. మండలంలోని లోతుగడ్డ పంచాయతీ, చెరుకుం పాకలు గ్రామం నుంచి ఇటీవల ఓ గర్భిణీ ప్రసవానికి విశాఖ కేజీహెచ్ లో చేరింది. ప్రసవం అనంతరం ఆమె నర్సీపట్నంలోని బంధువుల ఇంటిలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి స్వగ్రామం చెరుకుంపాకలు చేరుకుంది. ప్రస్తుతం నర్సీపట్నంలో కోవిడ్ వైరస్ పై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె బంధువులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని చింతపల్లి వైద్యాధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన చెరుకుంపాకలు గ్రామం వెళ్లి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను విశాఖ కెజిహెచ్ ఐసోలేషన్ కు తరలించారు. ఆ గ్రామంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన బ్లీచింగ్ పౌడర్ జల్లి, సోడియం హైడ్రోక్లోరైట్ పిచికారీ చేశారు. దీంతో కరోనా వైరస్ లక్షణాలు కలిగిన ఆమె ఎవరితో సన్నిహితంగా ఉన్నదనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 34 మందిని అధికారులు గుర్తించినట్లు తెలిసింది.కరోనా వైరస్ లక్షణాలు కలిగిన ఆమె నివసించిన ప్రాంతాన్ని కంటెన్మెంట్ జోన్ చేశారు. ఈ సంఘటనతో మండలంలో ఇది 2వ,కరోనా లక్షణాలు కలిగిన కేసు. దీంతో మండల వాసులు భీతిల్లుతున్నారు.
No comments:
Post a Comment