Followers

28 నుంచి మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు



28 నుంచి మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు

పోలీసులకు -- మావోయిస్టులక  మధ్య నలుగుతున్న గిరిజనులు

చింతపల్లి, పెన్ పవర్

విశాఖ మన్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆధిపత్య యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాల విజయవంతానికి మావోయిస్టులు,విఫలయత్నానికి పోలీసులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.గిరిజన గ్రామాల పై పట్టు కోసం మావోయిస్టులు, పోలీసులకు మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు.ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తే ఇంకొకరికి ఆగ్రహం కలుగుతుందనే ఉద్దేశంతో గిరిజనులు మౌనంగా ఉండి పోతున్నారు.దీనిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి అటు మావోయిస్టులు ఇటు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మిలీషియా సభ్యులను వారి ఉద్యమం నుంచి దూరం చేసి, మావోయిస్టులకు ఆశ్రయం లేకుండా చేయాలన్న పోలీసుల వ్యూహం  సత్ఫలితాలిచ్చింది. గిరిజనులకు మావోయిస్టులు చేసిన హింసాకాండను గిరిజనులకు అర్థమయ్యే రీతిలో ''ఆదివాసి చైతన్య సంఘం''  'అల్లూరి గిరిజన సేవా సంఘం" పేరిట గోడ పత్రికలు వెలుస్తున్నాయి. మన్యంలో పట్టుకోసం మావోయిస్టులు, పోలీసుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. మావోయిస్టు ఉద్యమానికి స్థానికంగా అండగా ఉంటున్న మిలీషియా వ్యవస్థను పూర్తిగా  నిర్మూలించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో మిలీషియా సభ్యులను గుర్తించి, వారి వివరాలను సేకరించారు. నయానో, భయానో వారు లొంగిపోయేలా పోలీసు యంత్రాంగం ఒత్తిడి పెంచింది. వారిపై ఉన్న కేసులు ఎత్తివేత,ఉపాధి అవకాశాలు కల్పించారు. మావోయిస్టు అగ్ర నాయకుడు, ఈ ప్రాంతీయుడు కుడుముల రవి అనారోగ్యంతో మృతి చెందడం, మరికొంత మంది మావోయిస్టులు, సానుభూతిపరులు స్వచ్ఛందంగా లొంగిపోవడం, మరోవైపు పోలీసులు జరుపుతున్న నిర్బంధ దాడుల్లో కొంత మంది మావోయిస్టులు మృతి చెందడం కూడా మిలిషియా సభ్యులపై ఒత్తిడి పెంచింది. పోలీసుల వ్యూహాల ఫలితంగా మావోయిస్టు పార్టీ లోకి కొత్తవారు చేరకుండా పోలీసులు కొంత వరకూ విజయం సాధించారు. ఉజ్వల, చేయూత, ప్రేరణ వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పోలీసులు ముందడుగు వేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా గిరిజన గ్రామాల్లో గిరి యువతకు ఆటల పోటీలు నిర్వహించి తద్వారా వారిని ప్రోత్సహిస్తూ వారితోనే జిల్లా స్థాయి పోలీస్ ఉన్నతాధికారులు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. గిరి యువత అక్రమ మార్గం వెతుక్కునే వీలు లేకుండా పోలీసులు కృషి చేస్తున్నారు. పులి మీద స్వారీ చేసే వాడు దానిని కొనసాగించాలే తప్ప స్వారీ ఆపి దిగితే ఆ పులి చంపేస్తుంది.డప్పుల దరువుతో ఒళ్ళు గగుర్పొడిచే ఆవేశపూరిత మావోయిస్టు పాటలకు, ఉపన్యాసాలకు ఆకర్షితులై ఉద్యమంలో చేరే వారి పరిస్థితి కూడా పులి లాగే ఉంటుందని పోలీసులు భోదిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్నంతసేపు వారిని ఉపయోగించుకుంటారని, ఆరోగ్యం బాగులేక, కుటుంబ ఒత్తిడి వలనో లొంగిపోయినా, పట్టుబడి జైలు శిక్ష అనుభవించి జనజీవనంలో కలిసి పోయి ప్రశాంతంగా జీవితాన్ని గడిపేవారిని పోలీస్ ఇన్ ఫార్మర్  అని వారిని కాల్చి చంపడం మావోయిస్టులకు  అలవాటేనని పోలీసులు గిరిజనులకు హితబోధ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వ్యూహాన్ని తిప్పికొట్టడానికి మావోయిస్టులు నడుంబిగించారు.తమ ప్రాబల్యం ఉన్న గిరిజన గ్రామాల్లో పట్టు సడలి పోకుండా తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గిరిజన గ్రామాల్లో పోలీసులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై పలు రకాల ఒత్తిళ్ళు తీసుకువచ్చి వారిని దారిలోకి తెచ్చుకోవడానికి మావోయిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు, మావోయిస్టు ఆధిపత్య పోరులో గిరిజనులు నలిగిపోతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...