ఒకే రోజు 8 మందికి కరోనా నిర్ధారణ కావడం తో ఉలిక్కి పడిన లంకెలపాలెం
రెడ్ జోన్ పరిధిలో లంకెలపాలెం జంక్షన్
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం: జివిఎంసి పరిధి లంకెల పాలెం గ్రామంలో 8 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ నూడిల్స్ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన అతని బంధువులు ఆరుగురికి ప్రైమరీ కాంటాక్ట్ కేసులు కింద పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి.సెకండరీ కాంటాక్ట్ కింద మరో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తెలిపారు. దీంతో లంకెలపాలెం జంక్షన్ లో ఉన్న అన్ని దుకాణ సముదాయాల ను అధికారులు హుటాహుటిన మూసి వేయించారు.ప్రధాన రహదారుల్లో రాకపోకలు జరపకుండా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. పరవాడ సిఐ ఉదయ్ కుమార్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.లంకెలపాలెం లో ఒక్కసారిగా 8 కరోనా కేసులు రావడంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు.మొత్తం ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉండడంతో నిత్య అవసరాల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వాపోతున్నారు. లంకెలపాలెం ప్రాంతంలో ఉండే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిసరాలను సాని టైజ్ చేస్తున్నారు. ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ ద్వారా ఇంకా ఎవరికైనా వైరస్ సోకిందా అనేదానిపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దృష్టిసారించారు. ఈ మేరకు ట్రు నాట్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. రెవిన్యూ, వైద్య ఆరోగ్య, పోలీస్ అధికారులు సంయుక్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని అధికారులు వ్యక్తిగత హోమ్ క్వారంటెన్ లో ఉంచారు.
No comments:
Post a Comment