వలస కూలీల రాక మొదలు
ఇప్పటికే జిల్లాకు చేరుకున్న216 మంది
మరో 500 మంది వరకూ వచ్చే అవకాశం
జిల్లా నుంచి తరలివెళ్లిన వలస కూలీలు 26 మంది
ఛత్తీస్‌ఘడ్ నుంచి జిల్లాకు చేరుకున్నవారు 26 మంది
జిల్లాకు చేరుకున్న మత్స్యకారులు 280
మార్గమధ్యంలో ఉన్న మత్స్యకారులు 314
అందరినీ క్వారంటైన్‌కు తరలింపు
విజయనగరం,పెన్ పవర్
ః బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి చిక్కుకుపోయిన వలస కూలీలను జిల్లాకు రప్పించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇప్పటికే జిల్లాకు 216 మంది వలస కూలీలు చేరుకోగా, మరో 500 మంది వరకూ వచ్చే అవకాశం ఉంది. వీరంతా ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో జిల్లాకు బయలుదేరినట్లు సమాచారం అందింది.
విజయనగరం జిల్లాకు వివిధ పనులకోసం వచ్చి చిక్కుకుపోయిన 26 మందిని జిల్లానుంచి ప్రత్యేక బస్సుల్లో పంపించారు. లాక్‌డౌన్‌కు ముందు జిల్లాలో చెరకు పనులకోసం వచ్చి 26 మంది సీతానగరం మండలంలో చిక్కుకుపోయారు. వీరిని ఇప్పటివరకు మరిపివలస వసతిగృహంలో ఉంచారు. ప్రభుత్వం అనుమతినివ్వడంతో వీరందరినీ ప్రత్యేక బస్సులో 25 మందిని ప్రకాశం జిల్లా ఎర్రగొంట్లకు, ఒకరిని తూర్పుగోదావరి జిల్లాకు పంపించారు.
పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్ నుంచి 26 మంది జిల్లాకు చేరుకున్నారు.
జిల్లా నుంచి వెళ్లిన 594 మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారు. వీరిలో ఇప్పటివరకు 280 మంది ప్రత్యేక బస్సుల్లో జిల్లాకు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. రాజ కుమారి, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత తదితరులు వీరిని రిసీవ్ చేసుకొని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వీరందరినీ పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ వద్ద, భోగాపురం మండలం మిరాకిల్ వద్ద, డెంకాడ మండలం ఎంవిజిఆర్ వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో ఉంచారు. మిగిలిన 314 మంది మార్గమధ్యంలో ఉన్నారు.
జిల్లాకు ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారందరినీ ముందుగా క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లో వీరి కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ముందుగా వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చిన ఫలితాలు, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 72 క్వారంటైన్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 21 సెంటర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో శుక్రవారం సాయంత్రానికి 416 మంది ఉన్నారు. ఇప్పటివరకు కేంద్రాలనుంచి 305 మందిని డిస్‌ఛార్జి చేశారు.
No comments:
Post a Comment