పారిశుధ్యంపై మరింత శ్రద్ద పెట్టాలి
జోన్‌లను బట్టి మాస్కుల పంపిణీ
కంటైన్‌మెంట్ జోన్‌లలో ప్రతిరోజూ సర్వే
పట్టణాల్లో త్రాగునీటి ఎద్దడి రానివ్వొద్దు
మున్సిపల్ కమిషనర్లకు మంత్రి బొత్స ఆదేశం
విజయనగరం, పెన్ పవర్
పారిశుధ్యంపై మరింత దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా మున్సిపాల్టీల్లో చేపడుతున్న పారిశుధ్య, అభివృద్ది కార్యక్రమాలను, మాస్కుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు.
మున్సిపల్ కమిషనర్లు అలసత్వాన్ని విడనాడాలని, రాష్ట్రంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పర్చేందుకు చర్యలను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్య సిబ్బందికి, సెక్రటరీలకు మద్య సమన్వయం ఉండేలా చూడాలని సూచించారు. ఇంటింటి చెత్తసేకరణ ప్రతీరోజూ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో మాస్కుల పంపిణీని వేగవంతం చేయాలని అన్నారు. రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేపట్టాలన్నారు. కంటైన్‌మెంట్ జోన్‌లలో వాలంటీర్ల ద్వారా ప్రతిరోజూ ఇంటింటి సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే క్వారంటైన్ కేంద్రాలవద్ద పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, ఈ కేంద్రాలవద్ద సిబ్బందిని నియమించే బాధ్యత జిల్లా కేంద్రంలోని కమిషనర్లదేనని పేర్కొన్నారు.
మనబడి నాడు-నేడు క్రింద మున్సిపల్ పరిధిలో రాష్ట్రంలో 783 పాఠశాలల అభివృద్దికి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ పనులను వెంటనే ప్రారంభించి ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లు నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్, భవనాల మైనర్ మరమ్మతులు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం తదితర పనులన్నీపేరెంట్స్ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలను తీసుకోవాలని, సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితోపాటు విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, విజయవాడ నుంచి ఎంఏయుడి సెక్రటరీ శ్యామలరావు, కమిషనర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment