Followers

సంక్షేమంలో మేటి...అభివృద్దిలో ఘ‌నాపాఠి


సంక్షేమంలో మేటి...అభివృద్దిలో ఘ‌నాపాఠి
స‌మ‌తూకంతో ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన  క‌లెక్ట‌ర్‌
జిల్లాకు వ‌రించిన జాతీయ పుర‌స్కారాలు
ల‌క్ష‌లాది మొక్క‌లు నాటి హ‌రిత జ‌వ‌హ‌రుడుగా ప్ర‌సిద్ది
ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల న‌డుమ రెండేళ్ల పాల‌న పూర్తి


బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్, విజ‌య‌న‌గ‌రం, 


  ప్ర‌గ‌తి ర‌థాన్ని ప‌రుగులు పెట్టించి, ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించి,  అభివృద్దికి బాట‌లు వేసి, సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌చెంత‌కు చేర్చి, ఎన్నో జాతీయ‌ పుర‌స్కారాల‌ను సంపాదించి, జిల్లా ఖ్యాతిని విశ్వ‌వీధిలో ఎగుర‌వేశారు మ‌న  క‌లెక్ట‌ర్ మ‌రియు జిల్లా మెజిస్ట్రేట్‌ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్, ఐ.ఏ.ఎస్‌. జల‌మే జీవ‌నాధారం అని గుర్తించి, జిల్లా వ్యాప్తంగా వంద‌లాది చెరువుల‌ను పున‌రుద్ద‌రించిన ద్ర‌ష్ట ఆయ‌న‌.  నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ, ప్ర‌జా శ్రేయ‌స్సే ప‌ర‌మావ‌ధిగా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ఆయ‌న చేసిన కృషి అస‌మానం, అనిత‌ర సాధ్యం. అందుకే ఆయ‌న‌ను అంద‌రూ గౌర‌వంగా హ‌రిత జ‌వ‌హ‌ర్‌లాల్ అని పిలుస్తున్నారు.  ఈనెల 17తో విజ‌య‌వంతంగా త‌న రెండేళ్ల పాల‌న‌ను పూర్తిచేసుకొని, ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా స్థానం సాధించిన మ‌న జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ప్రస్థానంపై ప్ర‌త్యేక క‌థ‌నం......


           జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ జీవిత‌మే ఒక స్ఫూర్తి. అట్ట‌డుగు స్థానం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్‌గా అత్యున్న‌త స్థాయికి ఎద‌గ‌డానికి ఆయ‌న చేసిన కృషి, త‌ప‌న ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కం. త‌న‌ను ఆద‌ర్శంగా తీసుకొని కొంద‌రైనా ఉన్న‌తస్థాయికి ఎదగాల‌న్న ఆకాంక్ష‌తో, క‌లెక్ట‌ర్‌తో కాసేపు అన్న వినూత్న‌ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.సంక్షేమ వ‌స‌తిగృహాల్లో చ‌దువుతున్న నిరుపేద విద్యార్థుల‌ను ప్ర‌తీ ఆదివారం త‌న బంగ్లాకు ర‌ప్పించుకొని, ఎదుగుద‌ల‌కు చ‌దువే మార్గ‌మంటూ వారిలో ప్రేర‌ణ క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. వృద్దాశ్ర‌మాలు, అనాధాశ్ర‌మాల‌కు వెళ్లి,  వారితో మ‌మేకమై, వారిని అప్యాయంగా ప‌ల‌క‌రించి క‌ష్ట‌సుఖాలు తెలుసుకొనేవారు. ఇలా సెల‌వు రోజుల్లో కూడా ఆయ‌న స‌మ‌యాన్ని ప్ర‌జ‌ల‌కోస‌మే వెచ్చించారు. ప్ర‌మాదానికి గురై, రోడ్డుపై బోల్తాప‌డ్డ ఒక ఆటోను చూసి త‌క్ష‌ణ‌మే త‌న‌వాహ‌నంలోనుంచి క్రిందికి దిగి స్వ‌యంగా జ‌నంతో క‌లిసి ఆటోను పైకిలేపి, గాయ‌ప‌డ్డ‌వారికి స‌ప‌ర్య‌లు చేసి త‌న‌లోని మాన‌వ‌త‌ను చాటుకున్నారు. జిల్లాకు అత్యున్న‌త అధికారి అయిన‌ప్ప‌టికీ,  ఒక సామాన్య వ్య‌క్తిలా ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి కుమారుడితో క‌లిసి ఆటోలో త‌న బంగ్లాకు చేరుకున్న సంఘ‌ట‌న హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ నిరాడంబ‌ర‌త‌కు నిద‌ర్శ‌నం.   సృజ‌నాత్మ‌క‌త‌కు మారుపేరు మ‌న జిల్లా క‌లెక్ట‌ర్. ఆయ‌న‌ పాల‌న‌లో క‌లికితురాయిగా నిలిచింది స్పంద‌న భోజ‌న ప‌థ‌కం. పేద‌ల క‌ష్టాలు విని చ‌లించిపోయిన జిల్లా క‌లెక్ట‌ర్‌‌, క‌లెక్టరేట్‌కు వ‌చ్చేవారి నుంచి అర్జీల‌ను స్వీక‌రించ‌డ‌మే కాకుండా, వారికి క‌డుపు నిండా భోజ‌నం పెట్టి పంపించాల‌న్న ఆశ‌యంతో రూపుదాల్చింది  ఈ ఆద‌ర్శ‌నీయ ప‌‌థ‌కం.  కేవ‌లం దాత‌ల విరాళాల‌తోనే నేటికీ విజ‌య‌వంతంగా న‌డుస్తున్న ఈ ప‌థ‌కం క్రింద‌, స్పంద‌న కార్య‌క్ర‌మంలో విన‌తులు ఇవ్వ‌డానికి వ‌చ్చిన వారంద‌రికీ రూ.10కే క‌డుపు నిండా భోజ‌నం పెడుతున్నారు. దివ్యాంగులు, గ‌ర్భిణిల‌కు పూర్తిగా ఉచితంగానే భోజ‌నాన్ని పెడుతుండ‌టం విశేషం. ఇప్పటి వరకు సుమారు 15 వేల మందికి సంతృప్తిగా రుచికరమైన భోజనాన్ని అందించారు. దీనికోసం త‌న బంగ్లాలో ప్ర‌కృతి సేద్యం ద్వారా కూర‌గాయ‌ల‌ను పండించి, ఉచితంగా ఈ ప‌థ‌కానికి స‌ర‌ఫ‌రా చేస్తుండ‌టం క‌లెక్ట‌ర్ ఔదార్యానికి, చిత్తిశుద్దికి నిద‌ర్శ‌నం. గ‌త‌మెంతో ఘ‌న‌కీర్తిగ‌ల విజ‌య‌న‌గ‌రానికి, నాటి ఘ‌న‌త‌ను నేటి త‌రానికి నిరంత‌రం గుర్తు చేసి, వారిలో స్ఫూర్తిని నింప‌డానికి ప‌ట్ట‌ణంలో ప‌లు చోట్ల సైన్‌బోర్డుల‌ను ఏర్పాటు చేయించారు క‌లెక్ట‌ర్‌. మ‌న విజ‌య‌న‌గ‌రం,  విద్య‌ల‌న‌గ‌రం, హ‌రిత విజ‌య‌న‌గ‌రం, క్రీడల న‌గ‌రం-విజ‌య‌న‌గ‌రం, సాంస్కృతిక విజ‌య‌న‌గ‌రం త‌దిత‌ర బోర్డుల‌ను ఏర్పాటు చేశారు. ప‌ట్ట‌ణాన్ని చెత్త‌ర‌హిత న‌గ‌రంగా మార్చి స్వ‌చ్ఛ విజ‌య‌న‌గ‌రంగా తీర్చి దిద్దేందుకు కృషి చేశారు. స్వ‌యంగా తాను ఒక డాక్ట‌ర్ కావ‌డంతో, జిల్లా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను గుర్తించి, జిల్లా కేంద్రానికి ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ను మంజూరు చేయించుకున్నారు.మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు, క‌ళ‌లు  అంటే జిల్లా క‌లెక్ట‌ర్‌కు అపారమైన మ‌క్కువ‌. వాటిని పునరుద్ద‌రించ‌డానికి ఈ రెండేళ్లూ ఆయ‌న ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాదు. ఘ‌న చ‌రిత్ర గ‌ల మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత నృత్య క‌ళాశాల‌ను దాని ప్రాభ‌వం దెబ్బ‌తిన‌కుండా పున‌ర్‌నిర్మించి, చ‌రిత్ర‌లో త‌న పేరును కూడా లిఖించుకున్నారాయ‌న‌. ఘ‌నంగా వందేళ్ల ఉత్స‌వాన్ని నిర్వ‌హించి నాటి క‌ళావైభ‌వాన్ని క‌ళ్ల‌ముందుకు తెచ్చారు.  అలాగే మ‌హాక‌వి గుర‌జాడ స్వ‌గృహాన్ని పున‌రుద్దించింది కూడా ఈ రెండేళ్ల కాలంలోనే. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను, పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు.  జిల్లా కీర్తిని ప్ర‌పంచ దేశాల్లో చాటిన ఘ‌న‌త హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌కే ద‌క్కింది. 2018లో జ‌రిగిన పేరిస్ పీస్ ఫోర‌మ్‌లో ఆయ‌న దేశం త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించి, ప్ర‌కృతి సేద్యంపై ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌ ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ట్టుకుంది. ప్ర‌కృతి సేద్యంలో పాఠాలు నేర్చుకోవాడినికి విదేశాల‌నుంచి జిల్లాకు ర‌ప్పించ‌డం ద్వారా జిల్లా ఖ్యాతిని, రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప‌జేశారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను జిల్లాకు తీసుకువ‌చ్చి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను చూపించి, ఆయ‌న చేత సెభాష్ అనిపించుకున్నారు.  జిల్లాకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డిని తీసుకొని వ‌చ్చి, ఆయ‌న చేతుల‌మీదుగా   జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌ ప‌థ‌కాన్ని ప్రారంభించుకున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు చేసిన ఏర్పాట్లు, రాష్ట్ర ఉన్న‌తాధికారుల‌నుంచి ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాయి. సాలూరు, గుమ్మ‌ల‌క్ష్మీపురం వ‌ద్ద గిరిజ‌న గ‌ర్భిణీల‌కోసం ప్ర‌త్యేక హాస్ట‌ళ్ల‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోనే ఆద‌ర్శంగా నిలిచారు.  
            క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ హ‌యాంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా దేశంలోనే ఒక ప్ర‌త్యేక గుర్తింపును సాధించింది. కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన  ప‌లు ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలను జిల్లాలో విజ‌య‌వంతంగా అమ‌లు జ‌రిపి పుర‌స్కారాల‌ను సాధించారు. పోష‌ణ్ అభియాన్ ప‌థ‌కం అమ‌ల్లో జిల్లాకు జాతీయ అవార్డు ద‌క్కింది. ఎక్స్‌టెండెడ్ గ్రామ స్వ‌రాజ్ అభియాన్‌, కృషి క‌ల్యాణ్ అభియాన్‌ కార్య‌క్ర‌మాలు అత్య‌ద్భుతంగా అమ‌లైన  నీతి అయోగ్  జిల్లాల్లో మ‌నం కూడా ఒక‌టిగా నిలిచి, కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాం. అలాగే ఇటీవ‌లే ఒకేసారి మూడు స్కోచ్ అవార్డులు కూడా జిల్లాకు వ‌రించాయి. గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కం అమ‌ల్లో కూడా జిల్లా అవార్డుల‌ పోటీకి నామినేట్ అయ్యింది. ర‌క్త‌దానానికి ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌డంలోఆయ‌న ఎప్పుడూ ముందుంటారు. సేవ్ బ్లూ అంటూ నీటి వ‌న‌రుల‌ను ప‌రిర‌క్షించ‌డం, స్ప్రెడ్ గ్రీన్ అంటూ ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించ‌డం, డొనేట్ రెడ్ అంటూ ర‌క్త‌దానానికి ప్రోత్స‌హించ‌డం జిల్లా క‌లెక్ట‌ర్ ముఖ్య నినాదాలు. దాని ఫ‌లితంగానే ర‌క్త‌దానంలో జిల్లాకు తొలిసారిగా రెడ్‌క్రాస్ అవార్డు వ‌రించింది.      నవరత్నాలు వంటి రాష్ట్ర‌ప్ర‌భుత్వ ప్రాధాన్య‌తా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూనే,  జిల్లా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందించి  అమలు చేయడానికి జిల్లా కలక్టర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.  స్పంద‌న ఫిర్యాదుల ప‌రిష్కారంలో తొలినుంచి జిల్లా మొద‌టి స్థానంలో నిలుస్తూ వ‌స్తోంది. గ‌త ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక ఓటింగ్ శాతం న‌మోదైన జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిల‌వ‌డం విశేషం. ఓట‌ర్ల‌ను చైత‌న్య‌ప‌రిచేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ తీసుకున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ద కార‌ణంగా ఈ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాము. డాక్ట‌ర్ వైఎస్ఆర్ కంటివెలుగు, కాపు నేస్తం ప‌థ‌కాల అమ‌ల్లో రాష్ట్రంలోనే ప్ర‌ధ‌మ స్థానాన్ని సాధించాం. పిఎం మాతృత్వ వంద‌న‌, వ‌నం మ‌నం, వైఎస్ఆర్ వాహ‌న‌మిత్ర త‌దిత‌ర కార్య‌క్ర‌మాల అమ‌ల్లో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచాము.  ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల్లో జిల్లా 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగ‌బాకింది. ఈ ఏడాది పదవ తరగతి ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేకశ్రద్ద పెట్టారు.  వైఎస్ఆర్ పెన్ష‌న్ కానుక పంపిణీలో ప్ర‌తీనెలా తొలి మూడు స్థానాల్లో నిలుస్తున్నాం. ఇంకా న‌వ‌ర‌త్నాల అమ‌ల్లో గానీ, వైఎస్ఆర్ న‌వ‌శ‌కంలోగానీ విజ‌య‌న‌గ‌రం జిల్లాను తొలి రెండు మూడు స్థానాల్లో నిల‌ప‌డం క‌లెక్ట‌ర్ గొప్ప‌ద‌నంగా పేర్కొన‌వ‌చ్చు. జిల్లా ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడేలా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఘ‌న‌త క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌దే. ఆయ‌న స్వ‌యంగా త‌న చేతుల‌తోనే వేలాది మొక్క‌లు నాటారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 5 గంట‌లు నుంచి 7 గంట‌లు వ‌ర‌కూ హ‌రిత య‌జ్ఞాన్ని కొన‌సాగించారు. ఆయ‌న స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా సుమారు కోటి 40 లక్షల  మొక్క‌లు వేళ్లూనుకొని చిగురించాయి. కేవ‌లం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోనే సుమారు రెండు ల‌క్ష‌ల మొక్క‌ల‌ను నాటారంటే, ఈ కార్య‌క్ర‌మం ఏ స్థాయిలో జ‌రిగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. అందుకే వ‌నం-మ‌నం కార్య‌క్ర‌మంలో కూడా మ‌న జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇటీవ‌ల చోటుచేసుకున్న వాతావ‌ర‌ణ మార్పులు, అహ్లాద‌ర‌క‌మైన ప‌రిశ‌రాలు హ‌రిత య‌జ్ఞం ఫ‌లిత‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు       దార్శ‌నిక‌త‌కు మారుపేరుగా నిలిచే హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జ‌లంతోనే జ‌గ‌త్ ముడిప‌డి ఉంద‌ని భావించారు. అందుకే మనవూరు - మనచెరువు పేరుతో చెరువుల శుద్దికి శ్రీ‌కారం చుట్టారు. దుర్ఘంధంతో కంపుకొట్టి, ముళ్ల‌పొద‌లు పెరుకుపోయి, చెత్త‌చెదారాల‌తో, ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో నిండిపోయిన చెరువుల స‌ముద్ద‌ర‌ణ‌కు ఆయ‌న న‌డుం బిగించారు. చిటికేస్తే ప‌లికే అధికార యంత్రాంగం త‌న చెప్పుచేతల్లో ఉన్న‌ప్ప‌టికీ, త‌న అధికారాన్ని, ద‌ర్పాన్ని ప్ర‌క్క‌న‌బెట్టి, చెరువుల శుధ్దికి ఆయ‌నే స్వ‌యంగా ముందుకు నడిచి స్వచ్చ సేవను ప్రారంభించారు. స్వ‌యంగా కాలువ‌ల్లో, చెరువుల్లో దిగి చెత్తా చెదారాల‌ను వెలికి తీశారు. ఆయ‌న్ను స్ఫూర్తిగా తీసుకున్న వంద‌లాది స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వేలాదిమంది యువ‌త చెరువు శుద్ది కార్య‌క్ర‌మాన్ని చేపట్టారు. ప్రజా భాగస్వామ్యంతో వంద‌ల చెరువులు ఇప్ప‌డు కొత్త‌రూపును సంత‌రించుకున్నాయి. అహ్లాదంగా మారి పార్కుల‌ను త‌ల‌పిస్తున్నాయి.విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ న‌డిబొడ్డున ఉన్న అయ్య‌కోనేరే దీనికి పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు. జిల్లా క‌లెక్ట‌ర్‌గానే కాకుండా, విజ‌య‌న‌గ‌రం కార్పొరేషేన్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా ఆయ‌న జిల్లా కేంద్రం రూపురేఖ‌ల‌ను మార్చేందుకు సాయ‌శ‌క్తులా కృషి చేశారు. జిల్లాకు త‌ల‌మానిక‌మైన క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దారు. భ‌వ‌నాల‌కు కొత్త సొబ‌గులు అద్దారు. ప‌ట్ట‌ణంలో రోడ్ల విస్త‌ర‌ణ‌ను చేపట్టి, విశాలంగా మార్చారు. న‌గ‌రానికి సైన్‌బోర్డుల‌తో కొత్త‌గా తోర‌ణాలు క‌ట్టారు. పెద్ద‌చెరువు చుట్టు అభివృద్దికి శ్రీ‌కారం చుట్టారు. మ‌రెన్నో పార్కుల‌ను అభివృద్ది చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారికి ప్ర‌పంచ‌మంతా గ‌జ‌గ‌జ‌లాడుతున్న స‌మ‌యంలో, ఈ అంటువ్యాధి ప్ర‌భ‌ల‌కుండా జిల్లాను దాదాపు 45 రోజుల‌పాటు సంరక్షించారు. చివ‌ర్లో వ‌ల‌స కూలీల‌ను జిల్లాకు అనుమ‌తించ‌క‌పోయి ఉన్న‌ట్ల‌యితే, నేటికీ విజ‌య‌న‌గ‌రం జిల్లా గ్రీన్ జోన్‌లోనే ఉండేద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. తాను స్వ‌యంగా జిల్లాకు స‌ర్వోన్న‌తాధికారి అయిన‌ప్ప‌టికీ ఏమాత్రం బేష‌జాలు లేకుండా అటు అధికారుల‌తో గానీ, ఇటు సామాన్య ప్ర‌జ‌ల‌తో గానీ క‌లిసిపోవ‌డం అల‌వాటు. హాస్టల్ విద్యార్దులు, పేద విద్యార్దుల సంక్షేమంపై ఆయన ఎంతోశ్రద్ద వహించారు.  సంక్షేమ వసతి గృహాల్లో మెనూను తనిఖీ చేసేందుకు స్వయంగా విద్యార్దులతో కలిసి నేలపై కలిసి కూర్చొని సహపంక్తి భోజనం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  ప్ర‌తిఒక్క‌రినీ పేరుపెట్టి అప్యాయంగా పిల‌వ‌డం ఆయ‌న నైజం. స‌మష్టి త‌త్వాన్ని అల‌వాటు చేసి, జిల్లా యంత్రాంగాన్ని ఒక కుటుంబంలా ముందుకు న‌డిపించారు. ఇటు అధికార యంత్రాంగానికి, అటు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు మ‌ధ్య చ‌క్క‌ని స‌మ‌న్వ‌యాన్ని ఏర్ప‌రిచడ‌మే కాకుండా, ప్ర‌జా ప్ర‌తినిధుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను అనుగుణంగా పాల‌నార‌థాన్ని ముందుకు న‌డిపించారు.  అందుకే ఆయ‌న విజ‌య‌వంతమైన క‌లెక్ట‌ర్‌గానే కాకుండా, ఒక ఆద‌ర్శ‌నీయ‌మైన వ్య‌క్తిగా కూడా ఇటు ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌న్న‌న‌ల‌ను పొంద‌డ‌మే కాకుండా, సామాన్య జ‌నం అభిమానాన్ని కూడా చూర‌గొన్నారు. 


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...