సమావేశంలో పాల్గొన్న పోరాట కమిటీ నాయకులు
గోదావరి ఆక్వా ఫుడ్ పార్కును తరలించాలి
- అక్కడ ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి
- అక్రమ కేసులను ఎత్తివేయాలి
- ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటి
పెనవర్, భీమవరం,
అనేక గ్రామాలను కాలుష్య కాసారాలుగా మార్చే గోదావరి ఆక్వా ఫుడ్ పార్కును అక్కడి నుండి తరలించాలని, ఆ స్థానంలో ఆక్వా యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని గోదావరి ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటి డిమాండ్ చేసింది. మండలంలోని తుందుర్రులో గురువారం పోరాట కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తుందుర్రులో తమ నివాస గృహాలను చేర్చి నిర్మించిన పార్కును తక్షణమే తరలించాలని, గ్రామస్థులపై అన్యాయంగా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. విశాఖ ఎజ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజి ఘటన ఎంత దారుణంగా మారిందో అందరం చూసామని గుర్తు చేసింది. కాగా ఫుడ్ పార్కును నివాస గృహాలకు చేర్చి నిర్మించారని, ఈ విషయం ఇటీవల పర్యటించిన గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీయే స్వయంగా గుర్తిందని కమిటీ కన్వీనర్ ఆంటి వాసు తెలిపారు. ఫ్యాక్టరీ మొదట్లో తెచ్చిన అనుమతులను పాటించకుండా, పర్యావరణానికి హాని కలిగించేవిధంగా నిర్వహిస్తున్నారన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఫ్యాక్టరీకి రూ.30 లక్షల జరిమానా కూడా విధించిందన్నారు. భవిష్యత్తులో విశాఖ గ్యాస్ లీకేజి వంటి సంఘటన ఇక్కడ జరిగితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందన్నారు. ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ ఘటన జరిగినప్పటి నుండి పార్కు సమీపంలోని మూడు గ్రామాల ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారన్నారు. ఇక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయంతో బతుకుతున్నామని, ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం గత ప్రభుత్వ సహకారంతో ప్రజలపై తప్పుడు కేసులు పెట్టించి, జైళ్ళలో నిర్బందించి పార్కు నిర్మాణాన్ని పూర్తి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించారన్నారు. పార్కు నిర్మాణంలో యాజమాన్యం మొండిగా వెళితే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్కును బంగాళాఖాతంలో కలిపేస్తానని తీవ్రంగా హెచ్చరించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరో ఎల పాలిమర్స్ వంటి సంఘటన జరగకముందే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఫ్యాక్టరీని తరలించి, దీని స్థానంలో ఆక్వా యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటి నాయకులు ముచ్చెర్ల త్రిమూర్తులు, యర్రంశెట్టి అబ్బులు, కొయ్య సంపత్, కోరం రమేష్, ఈద బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment