సమాజ సేవకు వైద్యులు ముందుకు రావాలి
ఇదొక సామాజిక బాధ్యతగా గుర్తించండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
విజయనగరం, పెన్ పవర్
ఈ క్లిష్ట సమయంలో సమాజానికి సేవచేసే బాధ్యత ప్రతీ డాక్టర్ పైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు. ప్రయివేటు వైద్యులంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణలో భాగస్వాములను చేసేందుకు ప్రయివేటు నర్సింగ్ హోమ్ అసోసియేషన్, ఐఎంఏ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కట్టుధిట్టమైన నియంత్రణా చర్యల కారణంగా ఇంతవరకూ మన జిల్లా సురక్షితంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకూ వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా విజయనగరం లాంటి పట్టణ ప్రాంతాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇలాంటి చోట వైద్యుల సేవలు చాలా అవసరమని చెప్పారు. అందువల్ల జిల్లా కేంద్రంలో ప్రతీ డివిజన్‌లో సేవలందించేందుకు డాక్టర్లు ముందుకు వచ్చి జాబితాను ఇవ్వాలని కోరారు. వార్డు సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యకర్త, శానిటరీ సిబ్బంది ప్రతీరోజూ వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారని చెప్పారు. వీరి సర్వేలో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించినవారికి, హైరిస్క్ వారికి తగిన పరీక్షలు నిర్వహించి అవసరమైత చికిత్సను అందించేందుకు, ప్రతీవార్డుకూ వైద్యులతో కూడిన బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి పలువురు వైద్యులు అంగీకారం తెలిపి, బుధవారం నాటికి జాబితాను అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్, జెసి-2 ఆర్.కూర్మనాధ్, డిఆర్ఓ జె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, కోవిడ్-19 ఆసుపత్రి వైద్యాధికారి సుబ్రమణ్య హరి కిషన్, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు, ఇంకా ప్రముఖ వైద్యులు వెంకటేశ్వర్రావు, చిట్టిరామారావు, జెఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment