ఆరోగ్య పరిరక్షణకు వారధి ఆరోగ్యసేతు
కరోనాపై అప్రమత్తంగా ఉంచడమే యాప్ లక్ష్యం
ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న 2లక్షల మంది
విజయనగరం, పెన్ పవర్
కరోనా మహమ్మారి పేరు చెబితే ప్రపంచమే వణికిపోయే పరిస్థితి. ఈ భయాన్ని పారద్రోలి, వ్యాధి పట్ల అవగాహనను పెంచడం, నిరంతరం అప్రమత్తంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించడం కూడా ఇప్పుడు జిల్లాలో ఒక ఉద్యమంలా మారుతోంది. కోవిడ్-19పై సంపూర్ణ అవగాహన పెంపొందించేందుకు దోహదపడుతోంది ఆరోగ్యసేతు యాప్. కరోనాపై పూర్తి సమాచారాన్ని స్థానిక భాషల్లోనే అందించడం, ఎప్పటికప్పుడు వ్యాధి గ్రస్తుల వివరాలను తెలియజేడయంతోపాటు, వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైతం కళ్లకు కట్టినట్టిగా చిత్రాలతో సహా తెలియజేయడం ఈ యాప్ గొప్పదనం. భౌతిక దూరాన్ని ఎలా పాటించాలి, చేతులను శుభ్రంగా ఎలా కడుగు కోవాలి, దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు బయటపడ్డప్పుడు ఏమి చేయాలి, అలాగే ఏమి చేయకూడదో తదితర వివరాలను సచిత్రంగా అందిస్తోంది.
ముఖ్యంగా స్వీయ పరిక్ష నిర్వహించుకొని, వ్యాధి వచ్చే అవకాశాలు మనకు ఎంతవరకూ ఉన్నాయో కూడా విశ్లేషించుకోవచ్చు. గూగుల్ లొకేషన్‌ను ఆన్ చేసి ఉంచడం, నెట్ కనక్షన్‌తో బాటు బ్లూటూత్‌ను కూడా ఆన్‌లో ఉంచినట్లయితే, పొరపాటున మన సమీపంలోకి కరోనా వ్యాధి గ్రస్తుడు ఎవరైనా వచ్చిన పక్షంలో, వెంటనే మనకి హెచ్చరికలు జారీ చేయడం ఈ యాప్‌లో ఉన్న మరో గొప్పదనం. అదేవిధంగా కరోనా వ్యాధి నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న చర్యలను వివరించడమే కాకుండా, దేశంలో, రాష్ట్రంలో వ్యాధి స్థితిగతులను, వ్యాధి గ్రస్తుల వివరాలను ఎప్పటికప్పడు అందజేస్తోంది ఆరోగ్య సేతు యాప్. విజయనగరం జిల్లాలో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేయించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్. సామాన్య ప్రజలు కూడా తమ స్మార్ట్ మొబైల్ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకొనేలా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం, ఇంటింటి ఆరోగ్య సర్వే ద్వారా కూడా యాప్ గురించి ప్రజలకు వివరించడంతోపాటు, ప్రతీ ప్రభుత్వ కార్యాలయానికి సర్క్యులర్‌లు జారీ చేసి, ఉద్యోగస్తులందరూ దీనిని డౌన్‌లోడ్ చేసుకొనేలా చర్యలు తీసుకున్నారు. దీని ఫలితంగా ఇప్పటివరకు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2లక్షల మంది ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తేలింది.
No comments:
Post a Comment