:
సర్వైలన్స్ పటిష్టంగా చేయడం వల్లనే జీరో కేసులు
లాక్ డౌన్ కొనసాగింపులో మినహాయింపులు
పాత్రికేయుల సమావేశం లో జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్
వాహనాలకు, దుకాణాలకు అనుమతులు తప్పనిసరి
లాక్ డౌన్ కు సహకరించి, స్వీయ నిర్బంధం లో ఉండాలి : జిల్లా ఎస్.పి బి. రాజకుమారి
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి డేవిడ్ రాజ్
జిల్లాలో సర్వైలన్స్ పటిష్టంగా చేయడం వల్లనే కరోనా జీరో కేసులతో సురక్షితంగా ఉండగలిగామని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలిపారు . బుధవారం కలెక్టర్, జిల్లా ఎస్.పి బి . రాజకుమారి తో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి జిల్లా లో చేపట్టిన కార్యక్రమాలను, మే నెల 3 వరకు లాక్ డౌన్ కొనసాగింపులో తీసుకోనున్న చర్యల పై వివరించారు. కరోనాను కట్టడి చేయడానికి జిల్లాలో 6 లక్షల 99 వేల కుటుంబాల ఇంటింటికి వెళ్లి 6 రకాల వివరాలను తీసుకోవడం జరిగింది . విదేశాల నుండి, డిల్లి నుండి, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి వచ్చిన వారి వివరాలతో పాటు, వయో వృద్ధులు, జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్న వివరాలను సర్వే ద్వారా డేటా ను సేకరించడం జరిగిందన్నారు. జిల్లాలో 794 నమూనాలను సేకరించి, కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపగా ఇంతవరకు 316 నెగటివ్ వచ్చాయని పేర్కొన్నారు.
మిమ్స్ ఆసుపత్రితో పాటు మరో 5 ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చి అన్ని వసతులను ఏర్పాటు చేసి, వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 22 వెంటిలేటర్లను, 66 ఐ.సి.యు, 959 నాన్ ఐ.సి.యు బెడ్స్ ను, సిద్ధం చేయడం జరిగిందన్నారు. 382 మంది వైద్యుల్ని, 1186 మంది నర్స్ లను, పారా మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. వైద్యుల కోసం 3500 పి పి ఎక్విప్మెంట్ ను, 4500 ఎన్-95 మాస్క్లను, 69 వేల సర్జికల్ మాస్క్ లను , 9 వేల లీటర్ల శానిటైసర్ తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచామని, స్టాక్ రిజిస్టర్ ద్వారా వినియోగించిన, వచ్చిన వాటి వివరాలను నమోదు చేయడం జరుగుతోందని తెలిపారు.
జిల్లాలో 1422 గదులలో 4507 బెడ్స్ కెపాసిటీ తో 39 క్వరెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జే.ఎన్.టి.యులో 139 మందిని క్వరెంటైన్ లో ఉంచి 14 రోజులు పూర్తి చేసుకున్న వారిని వారి ఇళ్ళకు పంపించినట్లు తెలిపారు. వీరికి భోజన, వసతి సౌకర్యాలతో పాటు వైద్య పరీక్షలను, మందులను అందించడం జరుగుతోందన్నారు. ఉపాధి కోల్పోయిన వారికీ 9 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి 316 మందికి ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా ప్రజా పంపిణి ద్వారా బియ్యం కంది పప్పు సరఫరా చేయడం జరిగిందన్నారు. వెయ్యి ఉన్న డిపో లను 3 వేలకు పెంచుతూ, ప్రజలు గుమికూడి ఉండకుండా చర్యలు తీసుకోవడం జరి గిందన్నారు. నిత్యావస రాలను సరఫరా చేసే వాహనాలకు, వ్యక్తులకు అనుమతినిస్తూ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధిక ధరల నియంత్రణకు ప్రతి చోట ధరల పట్టికలను ప్రదర్శించేలా ఆదేశించడం జరిగిందన్నారు. పారిశుధ్యం పై ప్రత్యెక ద్రుష్టి పెట్టడం జరిగిందని, అన్ని వార్డులలో, 920 పంచాయతీలలో హైపో క్లోరైడ్ ను స్ప్రే చేసేలా 344 పారిశుధ్య బృందాలను ఏర్పాటు చేయడమైనదన్నరు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం తదితర అంశాల పై అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. పాలనా పరంగా జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ లను ఏర్పాటు చేసి, నోడల్ వ్యవస్థ ద్వారా ఒక్కో అంశాన్ని ఒక్కో అధికారి పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ లకు వచ్చే ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించడం జరుగుతోందన్నారు.
ఇతర ప్రాంతాల నుండి వచ్చే రహదారులన్నీ మూసివేత :
జిల్లాలో 40 రూట్ లను గుర్తించి వాటికీ బారికాడింగ్ చేయడం జరిగిందని ముఖ్యంగా విశాఖపట్నంలో పాజిటివ్ కేసు లున్నందున, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకుండా జిల్లా సరిహదుల్లో ఉన్న రహదారులన్నిటిని మూసి వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రధాన మార్గాల వద్దే కాకుండా లింక్ రోడ్ల వద్ద కూడా చెక్ పోస్ట్ లను పెట్టి నిఘా పెంచడం జరిగిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారుల అనుమతి తోనే ఎవరైనా కదిలేలా కట్టుదిట్ట మైన ఏర్పాట్లను చేశామన్నారు. ఇందులో పోలీస్ పాత్ర కీలకమని, ముఖ్యంగా పోలీస్, వైద్యాధికారులు, సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పాత్రికేయులు ప్రధాన భూమిక వహించారని వారి సేవలను కొనియాడారు. మే3 వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యం లో రైతులకు, కూలీలకు, కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అన్ని జాగ్రతలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉపాది పనులకు, కొన్ని పరిశ్రమల్లో స్కెలిటన్ స్టాఫ్ తో పని చేయుటకు అనుమతినివ్వనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవ్వరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రైవేటు వైద్యులు అత్యవసర ఓ.పి లను చూడాలని, కోవిడ్ లక్షణాలు కనపడితే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలని విజ్ఞప్తి చేసారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని, తమ ఆరోగ్య పరిస్దితిని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు.
లాక్ డౌన్ కు సహకరించి, స్వీయ నిర్బంధం లో ఉండాలి : జిల్లా ఎస్.పి బి. రాజకుమారి
ప్రజల కోసం పోలీస్ లు రోడ్ల పైకి వసున్నారని, ప్రజలు దీనిని గమనించి, ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే ఒక్కరే బయటకు రావాలని జిల్లా ఎస్.పి బి. రాజకుమారి తెలిపారు. ఈ విషయం లో ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపదుతున్నామని అన్నారు. విదేశాల నుండి వచ్చిన 445 మందిని గుర్తించి వారిని గృహ నిర్బంధం లో ఉంచామని, అయితె వారిలో 67 మంది చట్టాన్ని ఉల్లంఘించారని, వారి పై కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. లాక్ డౌన్, క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి అవగాహనా కల్పిస్తూనే, మరో పక్క కేసులను బుక్ చేస్తున్నమన్నారు. అనుమతి లేని 558 వాహనాలను సీజ్ చేసామని, అనుమతి లేని, సమయాన్ని పాటించని 435 షాపుల పై కేసులు పెట్టామని తెలిపారు. ఇంతవరకు ఒక కోటి 15 లక్షల రూపాయలను అపరాధ రుసుం ను వసూలు చేయడం జరిగిందన్నారు. బయట వారిని జిల్లా లోనికి రాకుండా నివారించడానికి 8 అంతర్ జిల్లా చెక్ పోస్ట్ లను, 4 అంతర్ రాష్ట్ర , 3 ఎన్ .హెచ్ చెక్ పోస్ట్ లను నిరంతరంగా పనిచేసే సిబ్బంది తో పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించేలా దృష్టి పెడుతున్నామని, రైతు బజార్లను, చేపల మార్కెట్ ను వికేంద్రీకరించి, జన రద్దీని తగ్గించగలిగామని, అక్కడ కూడా కోవిడ్ పై అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో 3500 మంది పోలీస్ శాఖ నుండి పనిచేయడం జరుగుతుందని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరిస్తున్నారని, ఇక పై కూడా ఇలాగే సహకరించాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా రెవిన్యూ అధికారి జే.వెంకటరావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment