వైద్యారోగ్య సిబ్బందిపై దాడిచేస్తే నాన్‌బెయిలబుల్ కేసు
గరిష్టంగా ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
విజయనగరం, పెన్ పవర్
విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, వైద్యారోగ్య సిబ్బందిపై దాడిచేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ హెచ్చిరించారు. ఇలా దాడిచేసిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేరం రుజువైన పక్షంలో గరిష్టంగా ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.5లక్షలు వరకు జరిమానా విధించే అవకాశం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆర్డినెన్స్‌ను జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి కేసులను ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి కేవలం 30 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలని చట్టం నిర్ధేశిస్తోందని పేర్కొన్నారు.
కోవిడ్-19 నియంత్రణలో వైద్యులు, నర్సులు, పేరా మెడికల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల సేవలు అమోఘమని కలెక్టర్ కొనియాడారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, రాత్రీపగలూ తేడా లేకుండా వీరు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. అలాంటివారిపై దేశంలో అక్కడక్కడా జరుగుతున్న దాడులు, ఐఎంఏ డిమాండ్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం-1897కు సవరణలు చేస్తూ, కొత్త ఆర్డినెన్స్‌ను జారీ చేసిందని తెలిపారు. వైద్యారోగ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పుడు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించినా, వారిపై దాడికి పాల్పడినా, దౌర్జన్యాలకు దిగినా ఈ చట్టం ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఆయా కేసుల తీవ్రతను బట్టి కనిష్టంగా 6 నెలలు నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అలాగే కనీసం రూ.2 లక్షలు నుంచి గరిష్టంగా రూ.5లక్షలు వరకు జరిమానా, ఒక్కోసారి రెండూ కలిపి విధించే అవకాశం ఉందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment