అరటి రైతులు ఆందోళన చెందొద్దు
మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్
విజయనగరం,
జిల్లాలో అరటి రైతులు ఆందోళన చెందవద్దని, వారికి కనీస మద్దతు ధర ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ భరోసా నిచ్చారు. . డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా పంటను కొనుగోలు చేయిస్తున్నామని చెప్పారు. ఇటు రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు, అటు వినియోగదారులకు కూడా అందుబాటు ధరలో విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఎక్కువగా కర్పూరా, జి-9 రకాలు ఉన్నాయని, వీటిని జిల్లాలోనే కాకుండా శ్రీకాకుళం, రాజాంతో బాటు ఒడిషాకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పట్టణాల్లో అరటిపళ్లను తోపుడుబళ్ల ద్వారా వీధుల్లో విక్రయించేందుకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు. గజపతినగరం, నెల్లమర్ల, విజయనగరం మున్సిపాలిటీ, కొత్తవలస, గుర్ల, వేపాడ, సీతానగరం, బాడంగి, తెర్లాం, సాలూరు మున్సిపాలిటీ, బొబ్బిలి మున్సిపాలిటీల్లో అరటి విక్రయానికి ప్రత్యేక ఏర్పాట్లును చేశామని చెప్పారు. చుట్టుప్రక్కల మండలాల నుంచి పంటను ఇక్కడికి తరలించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా రోజుకు జి-9 రకం సుమారు 4 మెట్రిక్ టన్నులు, కర్పూరా రకం 23 టన్నులు మొత్తం 27 టన్నులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా అరటి పళ్లు పాడైపోకుండా ఉండేందుకు వాటిని శీతల గిడ్డంగులు, రైపనింగ్ కేంద్రాల్లో ఉంచేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు జెసి తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలోని రైపనింగ్ సెంటర్ల సామర్ధ్యం ః
విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 5 మెట్రిక్ టన్నులు చొప్పున, విజయనగరరం ఆటోనగర్లోని ప్రయివేటు కేంద్రంలో 20 మెట్రిక్ టన్నులు, శివరాం, గరివిడి ఎఫ్‌పిఓ లవద్ద 36 టన్నుల నిల్వ సామర్ధ్యం ఉంది.
No comments:
Post a Comment