అదును చూసి కిరాయి పెంచేస్తారా..
మానవతా దృక్ఫథం లేదా ?
లారీ ఓనర్స్ అసోసియేషన్‌పై జెసి ఆగ్రహం
రవాణా ఛార్జీలు తగ్గించాలని ఆదేశం
బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్: డేవిడ్ రాజ్
లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. పేదలు ఉపాధి కోల్పోయారు. ఇది మానవతా దృక్ఫథాన్ని చూపించాల్సిన సమయం. ఇలాంటి కష్టకాలంలో అదను చూసి కిరాయిలు పెంచేస్తారా ?...అని లారీ ఓనర్స్ అసోసియేషన్‌పై జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ మండిపడ్డారు. లారీల అద్దెలు పెంచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసరాలు, కూరగాయల రవాణా ఛార్జీల నియంత్రణపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, లారీ ఓనర్స్ అసోసియేషన్లతో కలెక్టరేట్‌లో శనివారం జెసి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ఇతర మండలాలకు, ఇక్కడినుంచి ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు సరుకుల రవాణాకు ప్రస్తుతం వసూలు చేస్తున్న రవాణా ఛార్జీలు, ఒకప్పటి ఛార్జీలను బేరీజు వేశారు. ప్రస్తుతం చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారని లారీ ఓనర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలు, కూరగాయలు ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే లారీ కిరాయిలు పెంచేయడం వల్ల ఇబ్బందులు ఎదురవు తున్నాయని అన్నారు. గతానికంటే ఒక్క రూపాయి కిరాయి పెంచినా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లారీ ఓనర్స్‌తో, ఇతర రాష్ట్రాల అసోసియేషన్లతో మాట్లాడి, వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించాలని రవాణాశాఖ డిప్యుటీ కమిషనర్ శ్రీదేవిని, మార్కెటింగ్ ఎడి వైవి శ్యామ్‌కుమార్‌ను ఆదేశించారు. నిత్యావసరాల రవాణాకు రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేదని, ఎక్కడినుంచి ఎక్కడికైనా తరలించవచ్చని జెసి స్పష్టం చేశారు. ఓఎస్‌డి జె.మోహనరావు మాట్లాడుతూ నిత్యావసరాల రవాణా విషయంలో పోలీసుశాఖ పరంగా ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment