హాస్టల్ విద్యార్దుల ఇంటికే రేషన్ సరఫరాకు ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్
విజయనగరం,
జిల్లాలో సంక్షేమ వసతి గృహాల విద్యార్దులకు వారి ఇంటికే నెల రోజుల భోజనానికి అవసరమైన రేషన్ సరుకులను అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైమరీ, యు.పి., హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల సహకారంతో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా ఈ నెలలోనే రేషన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ, విద్యాశాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం తన ఛాంబర్ లో రేషన్ పంపిణీకి చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వున్న బి.సి., ఎస్.సి., ఎస్.టి. సంక్షేమ వసతి గృహాలలో, గురుకులాల్లో మోడల్ స్కూల్స్, కె.జి.బి.వి.ల్లో చదువుతున్న 30,096 మంది విద్యార్ధులకు నెల రోజులకు సరిపడే రేషన్ సరుకులను ఒక్కో విదార్ధికి అందించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ విద్యార్ధికి ఏ వాలంటీర్ ద్వారా సరుకులు అందించాలనే అంశాన్ని మాపింగ్ చేయాల్సి వుందని కలెక్టర్ చెప్పారు.
ఒక్కో విదార్దికి 12.5 కిలోల బియ్యం, 30 గుడ్లు, 28 వేరుశనగ చిక్కీలు వంతున అందజేయాలని ఆదేశాలు వున్నాయని జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి చెప్పారు. సరుకుల పంపిణీలో ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా చూసేందుకు ఆన్ లైన్ విధానాన్ని అవలంబించాలని కలెక్టర్ ఆదేశించారు. వీలయితే ఒక యాప్ ను అభివృద్ధి చేసి పంపిణీని చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సంక్షేమ అధికార్లు, విద్యా శాఖ అధికారులు సంయుక్తగా ఆచరణ యోగ్యమైన ఒక విధానం రూపొందించి అమలుకోసం ప్రతిపాదించాలని కలెక్టర్ చెప్పారు.
జిల్లాలో పంపిణీకి 317 క్వింటాళ్ళ బియ్యం, 8.91 లక్షల గుడ్లు అవసరం ఉంటాయని డి.ఇ.ఓ. వివరించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్, బి.సి.సంక్షేమ అధికారి డి.కీర్తి, గిరిజన సంక్షేమ అధికారి కిరణ్ కుమార్, సర్వశిక్ష పి.ఓ. కృష్ణముర్తి నాయుడు, ఐ.సి.డి.ఎస్. పి.డి. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment