సరిహద్దుల్లోనే కరోనా నిర్ధారణా పరీక్షలు
మొబైల్ లేబ్ ద్వారా ర్యాపిడ్ టెస్ట్‌లు ప్రారంభం
జిల్లాలో ప్రవేశించేవారికి ఆరోగ్య తనిఖీలు తప్పనిసరి
చెక్‌పోస్టులవద్ద మరింత నిఘా
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
విజయనగరం, పెన్ పవర్
సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పెంచింది జిల్లా యంత్రాంగం. వివిధ ప్రాంతాలనుంచి జిల్లాలో ప్రవేశించే మార్గాలను ఇప్పటికే మూసివేసిన విషయం తెలిసిందే. అయితే అత్యవసర పనులపై వచ్చేవారు, కాలినడకన జిల్లాలో ప్రవేశించేవారిని సైతం గుర్తించి, వారికి వైద్య పరీక్షలను నిర్వహించే ప్రక్రియను శనివారం ప్రారంభించింది. దీనిలో భాగంగా స్థానిక విటి అగ్రహారం వైజంక్షన్ వద్ద మొబైల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి, జిల్లాలోకి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రానున్న రోజుల్లో మరిన్ని మొబైల్ లేబ్‌లను ఏర్పాటు చేసి, జిల్లాలో ప్రవేశించే ఇతర సరిహద్దుల వద్ద కూడా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చైన్నై నుంచి వచ్చిన 25 మందికి పరీక్షలు
చెన్నై నుంచి జిల్లాలోకి కాలినడకన వస్తున్న మెరకముడిదాం మండలానికి చెందిన సుమారు 25 మంది వలస కూలీలను వైజంక్షన్ వద్ద పోలీసులు ఆపివేశారు. అక్కడ ఉన్న మొబైల్ లేబ్ లో వీరికి వైద్య పరీక్షలను నిర్వహించారు. ట్రూనాట్ టెస్ట్‌లను సైతం నిర్వహించారు. అనంతరం వీరిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే విజయవాడ నుంచి జిల్లాకు వచ్చిన అధికార బృందాన్ని సైతం ఈ చెక్‌పోస్టు వద్ద ఆపివేసి, వారికి కూడా ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు. వచ్చినవారి వద్ద నుంచి ఆధార్, మొబైల్ ఫోన్ నెంబర్లను తీసుకుంటున్నారు. ఆధార్ లేని వారికి అధికారులే ఒక ప్రత్యేక కోడ్ నెంబర్‌ను కేటాయించి, వారి ఆరోగ్య వివరాలను నమోదు చేసుకుంటున్నారు. జిల్లా మీదుగా ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వెళ్లేవారికి సైతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాకే, జిల్లా మీదుగా ప్రయాణించేందుకు అనుమతినిస్తున్నారు. ఈ మొబైల్ లేబ్ లో డాక్టర్ పి. బాలాజీ, డాక్టర్ ఎం.జె.సుధీర్, లేబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, రాకోడు పిహెచ్‌సి పేరామెడికల్ సిబ్బంది సిహెచ్ కృష్ణ తదితరులు విధులు నిర్వహించారు.
జిల్లాకు వచ్చేవారికి వైద్య పరీక్షలు తప్పనిసరి ః కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
జిల్లాలో ప్రవేశించే ప్రతీఒక్కరికీ వైద్య పరీక్షలు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. దీనికోసమే వైజంక్షన్ వద్ద కొత్తగా మొబైల్ లేబ్‌ను ఏర్పాటు చేశామని, మరికొన్ని చోట్ల కూడా వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, కరోనా నివారణకు ఏడంచెల వ్యూహాన్ని అమలు చేస్తుండటం తదితర కారణాలవల్ల ఇప్పటివరకూ మన జిల్లా సురక్షితంగా, గ్రీన్ జోన్‌లో ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల సరిహద్దులవద్ద నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా రోగులను గానీ, రోగ లక్షణాలు కలిగిన వారిని గానీ సరిహద్దుల్లోనే గుర్తించడం ద్వారా వ్యాధిని జిల్లాలోకి అడుగుపెట్టనివ్వకుండా మరింత సమర్థవంతంగా నిరోధించడానికి దోహదపడుతుందని చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి అన్ని చెక్‌పోస్టులవద్దా వైద్య పరీక్షలు నిర్వహించి, అనుమానితులను కోవిడ్ ఆసుపత్రికి, లేదా క్వారంటైన్‌కు తరలించనున్నామని తెలిపారు. దీనికోసం సరిహద్దు చెక్‌పోస్టుల్లో 24 గంటలూ పనిచేసేలా పోలీసులు, రెవెన్యూ, వైద్యసిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారిని గుర్తించేందుకు గ్రామాల్లో కూడా వాలంటీర్లు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ద్వారా సర్వే జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
No comments:
Post a Comment