సర్వసన్నద్దంగా ఉండాలి
అలసత్వానికి తావివ్వొద్దు
1514 మందికి నిర్ధారణా పరీక్షలు
పిహెచ్‌సిల్లో కూడా ర్యాపిడ్ టెస్టులు
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్
జిల్లా గ్రీన్ జోన్‌లో ఉన్నప్పటికీ ఏమాత్రం అలసత్వాన్ని చూపకుండా, సర్వసన్నద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 ఎదుర్కొనడంలో జిల్లాలోని ప్రభుత్వ శాఖల సన్నద్దపై కలెక్టర్ మరోసారి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వివిధ అంశాల ప్రాధాన్యతను వివరించారు.
సర్వైలెన్స్ స్ట్రాటజీ
కోవిడ్-19ను ఎదుర్కొనడంలో సర్వైలెన్స్ స్ట్రాటజీ చాలా ముఖ్యమైనదని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలను గుర్తించడం, ఇంటింటికీ సర్వే చేయడంతోపాటు తాజాగా ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఇంటింటికీ ఎఎన్ఎంల ద్వారా సర్వే చేయడం జరుగుతోందన్నారు. దీనిలో జ్వర పీడితులను గుర్తించి, వారికి జిల్లాలో ఉన్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో విటిఎం విధానం ద్వారా ఇప్పటివరకూ 1109 మందికి కరోనా నిర్ధారణా పరీక్షలను నిర్వహించగా, అందరికీ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అలాగే విజయనగరం, పార్వతీపురం, సాలూరులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 405 మందికి ట్రూనాట్ కిట్ల ద్వారా పరీక్షించామని, వారందరికీ కూడా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. జిల్లాకు మరో 1700 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వస్తున్నాయని, సిబ్బందికి శిక్షణ ఇచ్చి పిహెచ్‌సిల్లో కూడా కరోనా నిర్ధారణా పరీక్షలను త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ వెళ్లడించారు.
క్వారంటైన్ సెంటర్లు
జిల్లాలో అనుమానితులను, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారిని ఉంచేందుకు మొత్తం 40 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 4,302 పడకలను సిద్దం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు చెప్పారు. వీటిలో ప్రస్తుతం ఆరు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని, వీటిలో ప్రస్తుతం 206 మందికి వసతి కల్పించామని, 116 మంది ఈ కేంద్రాలనుంచి గడువు అనంతరం పంపించేశామని వెళ్లడించారు.
ఆసుపత్రుల సన్నద్దత
జిల్లా ఇప్పటివరకు సురక్షితంగా ఉందని, అయినప్పటికీ ఆరు కోవిడ్ ఆసుపత్రులను సిద్దం చేసి, ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉన్నామని జాయింట్ కలెక్టర్-2 ఆర్.కూర్మనాధ్ వివరించారు. మిమ్స్ ఆసుపత్రి, జిల్లా కేంద్రాసుపత్రి, క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి, గాయత్రి ఆసుపత్రి, శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుష్పగిరి కంటి ఆసుపత్రులను కోవిడ్-19 ఆసుపత్రులుగా రూపొందించి, అక్కడ పరికరాలను, సిబ్బందిని, మందులను సిద్దంగా ఉంచామన్నారు.
సహాయ కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతున్న నేపథ్యంలో పేద ప్రజల సంక్షేమానికి కూడా అత్యధిక ప్రాధాన్యతినిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా నిరాశ్రయులకు, వలస కూలీలకు, బిక్షగాళ్లకు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయిన వారికోసం ప్రభుత్వ ఆద్వర్యంలో 6, ప్రయివేటు ఆధ్వర్యంలో 9 ఉపశమన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీశాఖాధికారి జి.లక్ష్మణ్ చెప్పారు. ఈ కేంద్రాల్లో సుమారు 555 మంది ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. ఇవి కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో 12, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 13 భోజన కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతీరోజూ సుమారుగా 3,613 మందికి రెండు పూటలా భోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో చేపట్టిని పారిశుధ్య కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ వివరించారు. రోజూ వార్డుల్లో స్పేయింగ్, బ్లీచింగ్ పౌడర్ జల్లడం, కాలువలు శుభ్రపరచడం చేస్తున్నామన్నారు. అలాగే మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది 1360 మందికి ఇప్పటివరకు మాస్కులను, శానిటైజర్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 5861 మంది పారిశుధ్య సిబ్బందికి 20వేల మాస్కులను, 300 లీటర్ల శానిటైజర్‌ను పంపిణీ చేశామని జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్ చెప్పారు. బ్లీచింగ్, ఫినాయిల్‌ను తెప్పించి నిత్యం గ్రామాల్లో పారిశుధ్య పనులను నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను శుభ్రంగా కడుగుకోవడం తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని డిపిఓ తెలిపారు.
నిత్యావసరాలకు ఇబ్బంది లేదు
జిల్లాలో నిత్యావసరాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలను తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ తెలిపారు. కనీసం 15రోజులకు సరిపడా స్టాకు ఉండేలా చూస్తున్నామని, రైతు బజార్లను వికేంద్రీకరించి, అందరికీ అందుబాటులో ఉంచామని తెలిపారు. అదేవిధంగా ఉచిత రేషన్ పంపిణీలో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉన్నామని జెసి చెప్పారు. గతనెలలో 91.55శాతం పంపిణీ చేశామని, ఈ నెలకు సంబంధించి 88.52 శాతం పంపిణీ పూర్తయ్యిందని జెసి తెలిపారు. అనంతరం లాక్‌డౌన్ వెసులుబాటుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 239పై అంశాల వారీగా చర్చించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ జి.నాగభూషణం, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment