మార్కెట్లు తనిఖీ చేసిన జెసి కిశోర్‌కుమార్
ధరలపై కొనుగోలుదారులను ఆరా
లారీ ఎక్కిమరీ సరుకులు పరిశీలన
విజయనగరం, పెన్ పవర్ ః సామాన్య ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ శుక్రవారం ఉదయం మార్కెట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు దారులను అడిగి మరీ ధరలపై వాకబు చేశారు. బోర్డుపై ఉన్న రేట్లకు, వ్యాపారులు విక్రయిస్తున్న దానికీ తేడా ఉందేమోనని ఆరా తీశారు. లారీ ఎక్కి మరీ సరుకులను, బిల్లులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ శుక్రవారం ఉదయం ముందుగా ఆర్అండ్‌బి రైతు బజార్‌ను తనిఖీ చేశారు. మార్కెటింగ్ సహాయ సంచాలకులు వైవి శ్యామ్‌కుమార్‌తో కలిసి ప్రతీషాపు తిరిగి, విక్రయిస్తున్న ధరలను వాకబు చేశారు. ప్రస్తుత కూరగాయల ధరలను ఆయనకు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ సిహెచ్.సతీష్‌కుమార్ వివరించారు. కొన్ని షాపుల్లో బోర్డు ధరలు కంటే కూరగాయలు తక్కువకు విక్రయిస్తుండటాన్ని గమనించారు. కూరగాయలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న వారిని కూడా ధరలపై వాకబు చేశారు. ఇదే సమయంలో కొనుగోలు దారులు భౌతిక దూరాన్ని పాటిస్తున్నదీలేనిదీ పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గంటస్థంభం వద్దనున్న హోల్‌సేల్ సరుకుల మార్కెట్‌ను పరిశీలించారు. ఆయా షాపుల్లో ఉన్న స్టాకును, విక్రయిస్తున్న ధరలను తనిఖీ చేశారు. సామాన్లు కొనుగోలు చేసి వెళ్తున్న వారితో మాట్లాడి, ఆయా వస్తువులను ఎంత ధరకు కొనుగోలు చేసిందీ అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ ఎడివద్ద నున్న ధరల పట్టికతో పోల్చిచూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. సరుకులు దించుతున్న లారీపైకి ఎక్కి మరీ, దానిలో సరుకులను, వాటి ధరలను జెసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోల్ వర్తకుల అసోసియేషన్ ప్రతినిధులు కె.ప్రభాకర్, రేపాక రామారావు, వికె సతీష్, రాంపండు తదితరులతో మాట్లాడాకె. సరుకులకు ఎటువంటి కొరతా రాకుండా చూడాలని వారిని జెసి కోరారు. అలాగే కొనుగోలు దారులు భౌతిక దూరాన్ని పాటించేటట్టు చూసే బాధ్యత కూడా వ్యాపారస్తులదేనని స్పష్టం చేశారు.
ప్రజలకు భరోసా కల్పించాం ః జెసి కిశోర్
కూరగాయలు, నిత్యావసరాలకు కొరత ఉండదన్న భరోసాను జిల్లా ప్రజల్లో కల్పించామని జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ అన్నారు. ప్రజలు ఏరోజుకారోజు తమకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేసుకుంటుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. లాక్‌డౌన్ మొదలైన దగ్గరనుంచీ జిల్లాలో ఎక్కడా ఏ వస్తువుకూ కొరత రాలేదని, అలాగే బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోలేదని చెప్పారు. రానున్న 15 రోజులకు సరిపడే నిత్యావసరాలు స్టాక్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. హోల్‌సేల్, రిటైల్ వర్తకులను సమన్వయం చేయడం ద్వారా ఇటు విక్రేతలకు గానీ, అటు ప్రజలకు గానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే జిల్లాకు ఇతర జిల్లాలనుంచి, ఇతర రాష్ట్రాలనుంచి సరుకులు దిగుమతి చేసుకొనే సందర్భంలో రవాణాపరంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నిర్ణయించిన ధరలకంటే ఎక్కడా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని, అటువంటివి ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయాలని జెసి సూచించారు.
No comments:
Post a Comment