అటవీ ఉత్పత్తుల కొనుగోలు బాధ్యత జీసీసీదే
• గిరిజన గ్రామాలకే వెళ్లి కొనుగోలు చేయండి
• చింతపండు తో పాటు ఇతర ఉత్పత్తులనూ సేకరించండి
• గోదాములు, కోల్డ్ స్టోరేజ్ లకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి.
• జీసీసీ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆదేశాలు
విజయనగరం,
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడకుండా వారు సేకరించిన అటవీ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) అధికారులను కోరారు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తుల కొనుగోలు బాధ్యత జీసీసీదేనని స్పష్టం చేసారు. ప్రస్తుతం వస్తున్న ఉత్పత్తులతో పాటు మరికొద్ది రోజుల్లో రానున్న ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
లాక్ డౌన్ కారణంగా గిరిజన సంతలన్నీ మూతపడటం, గిరిజనులు మైదాన ప్రాంతాలకు వెళ్లి అటవీ ఉత్పత్తులను అమ్ముకొనే అవకాశాలు లేక కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బుధవారం డిప్యుటీ సిఎం పుష్ప శ్రీవాణి జీసిసి అధికారులతో అటవీ ఉత్పత్తుల సేకరణ గురించి ఫోన్ లో సమీక్షించారు. ప్రస్తుతం చింతపండు దిగుబడి వచ్చిందని, కొన్ని గిరిజన గ్రామాల్లో రైతులు చింతపండు నిల్వలను పెట్టుకొని వాటిని అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారంటూ వచ్చిన మీడియా కథనాలను ప్రస్తావించారు. అయితే తాము ఇప్పటికే 200 మెట్రిక్ టన్నుల చింతపండును కొనుగోలు చేసామని ఈ సందర్భంగా జీసీసీ అధికారులు తెలిపారు. మరో 200 టన్నుల దాకా చింతపండును కొనే అవకాశం ఉందని వివరించారు. చింతపండును కొనుగోలు చేయడానికి నేరుగా గిరిజన గ్రామాలకే వెళ్లాలని అధికారులను పుష్ప శ్రీవాణి ఆదేశించారు. ప్రస్తుతం వస్తున్న చింతపండుతో పాటుగా మరో వారం పది రోజుల్లో అందుబాట్లోకి రానున్న గానుగ పప్పు, విప్ప పువ్వులు, కొండ చీపుర్లను కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కూడా కోరారు. గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేసే బాధ్యత జీసీసీదేనని పేర్కొన్నారు. ఎక్కడైనా అధికారులు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా గిరిజనులు ఇబ్బంది పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
గోదాములు..శీతల గిడ్డంగులు
ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను నిల్వ చేయడానికి తగిన స్థాయిలో గోదాములు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్) లేవని చెప్పారు. ఈ కారణంగా వచ్చిన ఉత్పత్తులను వచ్చినట్లుగా అదే సీజన్ లో అమ్మకతప్పని పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చింతపండు ఎక్కువగా దిగుబడి వస్తున్నా సీజన్ లో దాన్ని నిల్వ చేసే సౌకర్యాలు కూడా లేవనే విషయాన్ని గుర్తు చేసారు. అయితే చింతపండు లాంటి వ్యవసాయ ఉత్పత్తులను కొంత కాలం నిల్వ చేసి అన్ సీజన్ లో విక్రయిస్తే దానికి మంచి ధర పలుకుతుందన్నారు. దీనికోసం శీతల గిడ్డంగులు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. అటవీ ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఏజెన్సీలో గోదాములు, శీతల గిడ్డంగులు నిర్మించాల్సిన ప్రాంతాలను గుర్తించాలని, వాటి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పుష్ప శ్రీవాణి జీసీసీ అధికారులను ఆదేశించారు.
No comments:
Post a Comment