విపత్కర పరిస్థితుల్లోనూ పంటలకు గిట్టుబాటు ధరలు: మంత్రి
విజయనగరం / పార్వతీపురం, పెన్ పవర్
విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రబీ పంటల కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పండించిన 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నల కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరతో ఎవరైనా మొక్క జొన్నలను కొంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్వతీపురంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం డిప్యుటీ సిఎం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ... కరోనా వైరస్, లాక్ డౌన్ సమస్యల కారణంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించకుండాపోయే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రభుత్వం రబీలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలను ప్రకటిచడంతో పాటుగా పంటలను కొనుగోలు చేయడానికి చర్యలను చేపట్టిందని వివరించారు.
రాష్ట్రంలో మొక్కజొన్న క్వింటాల్ కు రూ.1760 మద్దతు ధరగా నిర్ణయించి, ఆ ధరలోనే ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని, అందుకే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతు ఇబ్బంది పడకూడదని మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసారని కితాబిచ్చారు. రైతులు తమ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో ఉండే అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ల వద్ద తాము పండిస్తున్న పంటలను నమోదు చేసుకుంటే ప్రభుత్వం వాటికి మద్దతు ధరలను ఇచ్చి కొనుగోలు చేస్తుందని చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా పథకం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లవేళలా రైతన్నలకు అండగా ఉంటుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ లాక్డౌన్ సమయంలోనూ వ్యవసాయ పనులకు ఇబందులు వాటిల్లకుండా, రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందిపడకుండా ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుందని పుష్ప శ్రీవాణి వివరించారు. జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి కారణంగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, మరికొన్ని రోజులు అందరూ ఇలాగే కృషి చేసి జిల్లాను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావుతో పాటుగా వైసీపీ స్థానిక నాయకులుకొండపల్లి బాలకృష్ణ, ,బెలగాం జయప్రకాష్ నారాయణ,మంత్రి రవి కుమార్ ,మజ్జి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment